కాళేశ్వరం అవినీతిపై రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారు: రాంచందర్ రావు
- కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయన్న రాంచందర్ రావు
- జాతీయ డ్యాం భద్రతా సంస్థ హెచ్చరించినా మరమ్మతులు చేపట్టలేదని విమర్శ
- హైడ్రా కేవలం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తోందని మండిపాటు
జనసంఘ్ స్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తదితర నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశ సమైక్యత కోసం ముఖర్జీ చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా నేతలు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ... కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. జాతీయ డ్యాం భద్రతా సంస్థ హెచ్చరించినా మరమ్మతులు చేపట్టకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే.. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆ అవినీతిపై ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు.
మరోవైపు హైడ్రా కూల్చివేతల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. హైడ్రా కేవలం పేదల ఇళ్లను టార్గెట్ చేస్తోందని... ఎంఐఎం నేతలకు చెందిన ఫాతిమా విద్యాసంస్థల అక్రమ కట్టడాలపై కోర్టులు తప్పుబట్టినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్-ఎంఐఎం దోస్తీ వల్లే ఈ పక్షపాతమని... హైడ్రా అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని, లేనిపక్షంలో విపక్షాల అక్రమాలపై రాష్ట్రవ్యాప్త పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.