భారీ వర్షాల్లో ప్రయాణం.. ఈ జాగ్రత్తలు ప్రాణాలు కాపాడతాయి!

Heavy Rains Travel These Safety Precautions Will Save Lives
  • వాతావరణం, ట్రాఫిక్ వివరాలు ముందే తెలుసుకోవాలి
  • తడి రోడ్లపై నెమ్మదిగా డ్రైవ్ చేయాలి
  • వరద నీటిలో వాహనం నడపొద్దు
  • రైలు సమయాన్ని ముందుగానే చెక్ చేసుకోవాలి
  • మొబైల్, పవర్ బ్యాంక్, గొడుగు వెంట ఉంచుకోవాలి
  • జారిపోని చెప్పులు ధరించాలి
భారీ వర్షాల సమయంలో ప్రయాణాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ జామ్‌లు, రైళ్ల ఆలస్యం, సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. బైక్‌, కారు, బస్సు లేదా రైలులో ప్రయాణించే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు.

ఇండియా టుడే కథనం ప్రకారం... ప్రయాణానికి ముందు వాతావరణ సూచనలు, ట్రాఫిక్ పరిస్థితిని తప్పనిసరిగా తెలుసుకోవాలి. భారీ వర్షం, వరదలు, కొండచరియలు విరిగిపడే హెచ్చరికలు ఉంటే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. కారు నడిపేవారు వేగాన్ని తగ్గించి, ముందు వాహనంతో తగినంత దూరం పాటించాలి. వర్షంలో పగటిపూట హెడ్‌లైట్లు ఆన్ చేయొద్దు. ఆకస్మికంగా బ్రేకులు వేయడం లేదా వేగంగా మలుపులు తిప్పడం నివారించాలి.

నీటితో నిండిన రోడ్లలో వాహనాన్ని నడపొద్దు. అలాంటి ప్రాంతాల్లో గుంతలు, తెరిచి ఉన్న డ్రైన్లు లేదా దెబ్బతిన్న రోడ్లు ఉండే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడం మంచిది.

రైలులో ప్రయాణించే వారు ముందుగానే రైలు సమయాన్ని పరిశీలించాలి. ప్లాట్‌ఫారంపై భద్రతా గీత వెనుక నిలబడాలి. రైలు ఆలస్యమైనా పట్టాలు దాటే ప్రయత్నం చేయకూడదు. రైల్వే అధికారులు చేసే ప్రకటనలను గమనిస్తూ ఉండాలి.

ప్రయాణంలో పూర్తిగా ఛార్జ్ చేసిన మొబైల్ ఫోన్, పవర్ బ్యాంక్, తాగునీరు, తేలికపాటి ఆహారం, అవసరమైన మందులు, గొడుగు లేదా రెయిన్‌కోట్ వెంట తీసుకెళ్లాలి. ముఖ్యమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను వాటర్‌ప్రూఫ్ కవర్లలో ఉంచాలి.

జారని చెప్పులు లేదా షూ ధరించడం మంచిది. నిలిచిపోయిన నీటిలో నడవకుండా ఉండాలి. అక్కడ గుంతలు లేదా తెరిచి ఉన్న డ్రైన్లు ఉండే అవకాశం ఉంది. పడిపోయిన చెట్లు, విద్యుత్ తీగలు, నీటితో నిండిన ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. వర్షం కారణంగా సరిగా కనిపించకపోతే సురక్షితమైన ప్రదేశంలో వాహనాన్ని ఆపి పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే ప్రయాణం కొనసాగించాలి.


Heavy Rains
Travel Safety Tips
Monsoon Driving Precautions
Road Safety In Rain
Monsoon Travel Essentials
Rain Safety Measures

More Telugu News