బీజేపీ నేతలు రాముడి హుండీలోని సొమ్మును కూడా లూటీ చేశారు: పొన్నం ప్రభాకర్
- అయోధ్య రామ మందిర విరాళాల సేకరణలో భారీ అవినీతి జరిగిందన్న పొన్నం ప్రభాకర్
- ఈ స్కామ్ కు మోదీ, అమిత్ షా, యోగి బాధ్యత మహించాలని డిమాండ్
- దేశ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలన్న పొన్నం
అయోధ్య రామ మందిర విరాళాల సేకరణలో కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగిందంటూ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఎదుగుదల కోసం దేవుడిని వాడుకోవడంలో బీజేపీ పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు తమ స్తోమతకు తగినట్లుగా రామయ్య గుడి కోసం విరాళాలు ఇస్తే, కమలం పార్టీ నేతలు ఆ సొమ్మును కూడా వదలకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
"బీజేపీ నాయకులు శ్రీరాముడి పేరును, అక్షింతలను అడ్డం పెట్టుకుని ఇళ్ల వెంట తిరిగి విరాళాలు వసూలు చేశారు. తీరా చూస్తే ఆ నిధుల్లోనే కోట్లాది రూపాయల అవినీతికి తెరలేపారు. దేవుడి హుండీలోని సొమ్మును సైతం లూటీ చేయడం దేశ ప్రజలందరినీ అవమానించడమే" అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అసలు రంగును, వారి అవినీతి అక్రమాలను అక్కడి స్థానిక ప్రజలు ముందే గుర్తించారని... అందుకే అయోధ్య పరిధిలోని లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిని అక్కడి ఓటర్లు ఓడించి బుద్ధి చెప్పారని పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.
భక్తి వేరు, రాజకీయం వేరని స్పష్టం చేసిన మంత్రి... ఈ విరాళాల కుంభకోణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లదే పూర్తి బాధ్యతని అన్నారు. దేవుడి పేరుతో సాగించిన ఈ పెద్ద స్కాంపై బీజేపీ తక్షణమే స్పందించాలని, దేశ ప్రజలందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తి ముసుగులో రాజకీయ వ్యాపారం చేసే శక్తులను ప్రజలు ఇకనైనా గుర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.