టాటా కొత్త తరానికి మరో కీలక బాధ్యత.. వెస్ట్‌సైడ్‌లోకి మాయా టాటా ఎంట్రీ!
- వెస్ట్‌సైడ్‌లో మాయా టాటా కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం
- వెస్ట్‌సైడ్ ఆన్‌లైన్, ఈ-కామర్స్ విభాగాలపై దృష్టి
- వెస్ట్‌సైడ్ అంతర్జాతీయ విస్తరణకు కృషి చేయనున్న టాటా కొత్త వారసురాలు
- ట్రెంట్‌కు 1,286 స్టోర్లతో రూ.19,700 కోట్ల ఆదాయం
ప్రస్తుతం ట్రెంట్ లిమిటెడ్ చైర్మన్‌గా ఉన్న నోయెల్ టాటా ఈ ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మాయా టాటా నియామకంపై ట్రెంట్ సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.
1989లో ముంబయిలో జన్మించిన మాయా టాటా యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్‌లో చదువుకున్నారు. అనంతరం లండన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. టాటా డిజిటల్‌లో చేరకముందు టాటా క్యాపిటల్‌కు చెందిన టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో పనిచేశారు.
మాయా సోదరుడు నెవిల్ టాటా ప్రస్తుతం ట్రెంట్‌కు చెందిన స్టార్ బజార్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆమె అక్క టాటా గ్రూప్ హోటల్ వ్యాపారంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ట్రెంట్ లిమిటెడ్‌కు వెస్ట్‌సైడ్ అత్యంత కీలక వ్యాపార విభాగం. సంస్థ మొత్తం ఆదాయంలో దాదాపు 40 శాతం ఈ బ్రాండ్ నుంచే వస్తోంది. ప్రతి ఏడాది సుమారు 50 కొత్త వెస్ట్‌సైడ్ స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 53 కొత్త స్టోర్లను ప్రారంభించింది.
ఇటీవల వెస్ట్‌సైడ్ యూఏఈలో తొలి అంతర్జాతీయ స్టోర్‌ను ప్రారంభించి గ్లోబల్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. భారతీయ ఫ్యాషన్ బ్రాండ్‌ను మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళికతో ట్రెంట్ ముందుకెళ్తోంది.
వెస్ట్‌సైడ్‌తో పాటు ట్రెంట్‌కు జూడియో, స్టార్ బజార్ వంటి ప్రముఖ రిటైల్ బ్రాండ్లు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కంపెనీ ఆదాయం సుమారు రూ.19,700 కోట్లు కాగా, దేశవ్యాప్తంగా 321 నగరాల్లో 1,286 స్టోర్ల నెట్‌వర్క్‌ను నిర్వహిస్తోంది.