మధ్యవర్తిత్వంలో పాకిస్థాన్‌తో పోలిక.. చైనా జర్నలిస్టుకు భారత రాయబారి గట్టి కౌంటర్
- పశ్చిమాసియా మధ్యవర్తిత్వంపై పాక్‌తో పోలికను తిరస్కరించిన భారత్
- రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను చూస్తేనే తేడా తెలుస్తుందన్న రాయబారి
- ఆ పోలిక అన్యాయమని చైనాలో స్పష్టం చేసిన విక్రమ్ దొరైస్వామి
- మధ్యవర్తిత్వానికి ఇప్పటికే చాలా దేశాలున్నాయని వెల్లడి
- జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని ఉద్ఘాటన
శనివారం బీజింగ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 14వ ప్రపంచ శాంతి ఫోరంలో విక్రమ్ దొరైస్వామి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఓ చైనా జర్నలిస్టు, పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేస్తోందని, ఈ విషయంలో భారత్ పాత్ర ఏమిటని ప్రశ్నించారు. దీనికి దొరైస్వామి సూటిగా సమాధానమిచ్చారు.
"భారత్‌ను పాకిస్థాన్‌తో పోల్చడం కొంత అన్యాయమైన విషయం. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలిస్తేనే మీకు వాస్తవాలు అర్థమవుతాయి" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వ్యవస్థలో ఏ దేశం ఎలాంటి పాత్ర పోషిస్తోందన్న అంశం ఆధారంగానే వాటిని అంచనా వేయాలని సూచించారు.
పశ్చిమాసియా వివాదంలో ఇప్పటికే పలు దేశాలు మధ్యవర్తిత్వానికి ప్రయత్నిస్తున్నాయని, ఈ రద్దీలో తాము చేరడం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఏమీ ఉండదని దొరైస్వామి అభిప్రాయపడ్డారు. గతంలో భారత్ ఇటువంటి పాత్రలు పోషించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో దీనివల్ల ఆశించిన ఫలితంఉండదని స్పష్టం చేశారు.
పశ్చిమాసియా, ఉక్రెయిన్ వంటి అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారంలో చైనా కూడా మధ్యవర్తిత్వానికి చొరవ చూపలేదన్న విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తుచేశారు. అగ్ర దేశాలు తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగానే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటాయని ఆయన వివరించారు.