ఖాకీ డ్రెస్‌లో వచ్చి.. పాటతో అదరగొట్టి.. లక్ష గెలుచుకున్న యూపీ పోలీస్!
- పోలీస్ యూనిఫాంలో టాలెంట్ షోకి వచ్చిన యూపీ కానిస్టేబుల్
- సొంతంగా రాసి పాడిన పాటకు లక్ష రూపాయల బహుమతి
- తల్లి కోరిక మేరకు ఉద్యోగం, ఆత్మ సంతృప్తికి సంగీతం అంటున్న కపిల్
- పాటల సాధన కోసం రాత్రిపూట డ్యూటీలు చేస్తున్న వైనం
- హోస్ట్‌తో పాటు జడ్జీలను సైతం ఆశ్చర్యపరిచిన పోలీస్
వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కపిల్ దిన్‌కర్ ఇటీవల 'ఇండియాస్ గాట్ లాటెంట్' సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొన్నారు. సమయ్ రైనా హోస్ట్ చేస్తున్న ఈ షోకి ఆయన డ్యూటీలో ఉన్న యూనిఫాంలోనే హాజరయ్యారు. వేదికపైకి వచ్చిన కపిల్, తాను స్వయంగా రాసి, స్వరపరిచిన గీతాన్ని అద్భుతంగా ఆలపించి జడ్జీల ప్రశంసలు అందుకున్నారు. అందరి నుంచి పూర్తి స్కోర్ సాధించి, లక్ష రూపాయల బహుమతిని కైవసం చేసుకున్నారు.
2021లో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన కపిల్ దిన్‌కర్‌కు సంగీతం, సాహిత్యం అంటే ప్రాణం. తల్లి కోరిక మేరకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పటికీ, తన అసలు ప్రపంచం అదేనని ఆయన చెబుతున్నారు. "నాకు గాయకుడిగా, రచయితగా, స్వరకర్తగా ఉండటమే ఆత్మ సంతృప్తిని ఇస్తుంది. జీవనం సాగించేందుకు, ఖర్చుల కోసం మాత్రమే నేను పోలీసుగా పనిచేస్తున్నాను" అని ఆయన తన అభిరుచిని వివరించారు.
సంగీత సాధన కోసం ఆయన ఉదయం సమయాన్ని కేటాయించుకుని, కావాలనే రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో ఉంటూనే సంగీతాన్ని కొనసాగించేందుకు అధికారికంగా అనుమతి పొందిన ఏకైక కానిస్టేబుల్ ఆయనే కావడం విశేషం. అంతేకాదు, ఆయన ఇప్పటికే 3 పుస్తకాలు రచించగా, మరో 8 పుస్తకాలు రాస్తున్నట్టు తెలిపారు. ఈ షోలో జడ్జీలు యూపీలోని నేరాల గురించి సరదాగా జోకులు వేయగా, కపిల్ వాటికి అంతే చమత్కారంగా సమాధానాలిచ్చారు. విధులకు ఆటంకం కలగకుండా తన అభిరుచిని కొనసాగిస్తున్న కపిల్ దిన్‌కర్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.