గెలిచినా సంతృప్తి లేదు.. మా ఆటలో చాలా తప్పులున్నాయి: మెస్సీ

Lionel Messi dissatisfied with win says many mistakes in our game
  • కేప్‌వెర్డేపై అర్జెంటీనా 3-2తో విజయం
  • జట్టు ఆటలో చాలా తప్పులున్నాయని అంగీకరించిన మెస్సీ
  • బంతిపై నియంత్రణ కోల్పోయామన్న కెప్టెన్‌
  • ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయామని అంగీకారం
  • నాకౌట్‌ దశకు ముందు లోపాలను సరిదిద్దుకోవాలన్న స్టార్‌ ఆటగాడు
పసికూన కేప్‌వెర్డేపై అర్జెంటీనా కష్టపడి గెలిచి ఫిఫా ప్రపంచకప్‌ ప్రీక్వార్టర్స్‌కు చేరడంపై కెప్టెన్‌ లియోనెల్‌ మెస్సీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయం సాధించినప్పటికీ జట్టు ఆటలో చాలా లోపాలు కనిపించాయని అన్నాడు. నాకౌట్‌ దశకు ముందు వాటిని తప్పకుండా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు.

మయామిలో శనివారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో అర్జెంటీనా అదనపు సమయంలో 3-2తో కేప్‌వెర్డేపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలో మెస్సీ కొట్టిన కార్నర్‌ ను రొమెరో హెడర్ తో గోల్ గా మలిచే ప్రయత్నం చేయగా... కేప్‌వెర్డే ఆటగాడి చేయికి తగిలిన బంతి గోల్‌ పోస్ట్ లోకి వెళ్లడంతో అర్జెంటీనా విజయాన్ని అందుకుంది. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో తలపడనుంది.

మ్యాచ్‌ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘‘మంచి విషయాలు ఉన్నాయి. అలాగే చాలా తప్పులు కూడా చేశాం. వాటిని సరిదిద్దుకోవాలి. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని తర్వాతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలి’’ అని చెప్పాడు.

మ్యాచ్‌ ప్రారంభంలో ఆధిక్యం సాధించిన తర్వాత తమ ఆట మెరుగుపడుతుందని భావించామని మెస్సీ తెలిపాడు. కానీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నాడు. ‘‘మేం బంతిపై నియంత్రణ కోల్పోయాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాలేకపోయాం. వారు తమ బలాన్ని ఉపయోగించుకుని మాకు ఇబ్బందులు కలిగించారు’’ అని వివరించాడు.

కేప్‌వెర్డేను తక్కువ అంచనా వేయలేదని కూడా మెస్సీ స్పష్టం చేశాడు. స్పెయిన్‌, ఉరుగ్వే వంటి బలమైన జట్లకు లొంగకుండా ఆ జట్టు ఇంతదూరం వచ్చిన విషయాన్ని గుర్తు చేశాడు. నాకౌట్‌ టోర్నీలో ఏ జట్టూ తేలికగా విజయం ఇవ్వదని పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో 29వ నిమిషంలో మెస్సీ గోల్‌ చేశాడు. దీంతో వరుసగా ఎనిమిది ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో గోల్‌ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. టోర్నీలో అర్జెంటీనా ఇప్పటివరకు ఓటమి లేకుండా ముందుకు సాగుతోంది.
Lionel Messi
Argentina Football Team
FIFA World Cup
Argentina vs Cape Verde
World Cup Pre Quarters
Messi Goal Record

More Telugu News