గుడ్డు శాకాహారమా? మాంసాహారమా?.. సైన్స్ ఏం చెబుతోంది?

Egg vegetarian or non vegetarian what does science say
  • గుడ్డు శాకాహారమా, మాంసాహారమా అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతున్న వైనం
  • వాణిజ్య ఫారాల్లో లభించే గుడ్లలో చాలావరకు ఫలదీకరణ చెందనివేనంటున్న‌ సైన్స్ 
  • జీవహింస అనే భావనతో భారతీయ సంప్రదాయంలో గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారని వెల్ల‌డి
  • పాలు, తేనె జంతువుల నుంచి వచ్చినా శాకాహారంగా భావిస్తున్నప్పుడు గుడ్డుపై భిన్నాభిప్రాయాలు
  • శాస్త్రీయ వాస్తవాలు, సాంస్కృతిక నమ్మకాల మధ్య ఇది వ్యక్తిగత ఎంపికగా మారిన వైనం
గుడ్డు శాకాహారమా? లేక మాంసాహారమా? అనే ప్రశ్న ఎన్నో ఏళ్లుగా చర్చనీయాంశంగానే ఉంది. గుడ్డులోంచి కోడిపిల్ల వస్తుంది కాబట్టి అది మాంసాహారమేనని చాలామంది నమ్ముతారు. అయితే, ఈ విషయంలో శాస్త్రీయ వాస్తవాలు, సాంస్కృతిక నమ్మకాలు, వ్యక్తిగత అభిప్రాయాలు కలగలిసి ఉన్నాయి. అందుకే ఈ ప్రశ్నకు ఒక్కటే సమాధానం చెప్పడం కష్టం.

శాస్త్రీయంగా పరిశీలిస్తే.. మార్కెట్లో లభించే చాలా గుడ్లు ఫలదీకరణ చెందనివి (unfertilised). వాణిజ్య కోళ్ల ఫారాల్లో పెట్టలను, పుంజులను వేర్వేరుగా ఉంచుతారు. మానవులలో అండం విడుదలైనట్లే, కోడి పెట్టలు కూడా పుంజుతో సంపర్కం లేకుండానే సహజంగా గుడ్లు పెడతాయి. ఇలాంటి గుడ్లలో పిండం ఉండదు కాబట్టి, అవి ఎప్పటికీ కోడిపిల్లలుగా మారే అవకాశం లేదు. శాస్త్రీయంగా చూస్తే, వీటిలో ప్రాణం ఉండదు. దీనికి భిన్నంగా పెరటి కోళ్లు లేదా ఫ్రీ-రేంజ్ ఫారాల్లో పెట్టలు, పుంజులు కలిసి తిరుగుతాయి. అక్కడ లభించే గుడ్లు ఫలదీకరణ చెందే (fertilised) అవకాశం ఉంటుంది. సరైన వాతావరణంలో పొదిగితే అవి పిల్లలుగా మారగలవు.

అయితే, భారతదేశంలో శాస్త్రీయ కారణాల కంటే సాంస్కృతిక, మతపరమైన నమ్మకాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జీవం ఉన్న లేదా జీవం వచ్చే అవకాశం ఉన్న దేనినైనా తినడం జీవహింసగా భావిస్తారు. ఈ నమ్మకం వల్లే గుడ్డును మాంసాహారంగా వర్గీకరించారు. గుడ్డు తింటే ఒక కోడిపిల్లను చంపినట్టే అనే భావన బలంగా పాతుకుపోయింది. అందువల్ల వాణిజ్య ఫారాల నుంచి వచ్చే గుడ్లలో జీవం లేదని తెలిసినా, చాలామంది దాన్ని మాంసాహారంగానే చూస్తారు.

ఈ చర్చలో మరో ఆసక్తికరమైన వాదన కూడా ఉంది. పాలు జంతువు నుంచే వస్తాయి, అయినా దాన్ని శాకాహారంగానే పరిగణిస్తాం. పాలు సేకరించడం వల్ల జంతువుకు ప్రాణహాని ఉండదు కాబట్టి దాన్ని ఆమోదిస్తున్నాం. తేనెటీగల నుంచి వచ్చే తేనెను కూడా చాలామంది శాకాహారంగానే స్వీకరిస్తారు. ఇదే తర్కం ప్రకారం.. ప్రాణం లేని (ఫలదీకరణ చెందని) గుడ్డును కూడా శాకాహారంగానే చూడాలని కొందరు వాదిస్తారు. అంతిమంగా గుడ్డును ఏ కోవలో చేర్చాలనేది శాస్త్రీయ వాస్తవాలు, సాంప్రదాయ నమ్మకాలు, వ్యక్తిగత విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
Egg
Vegetarian or Non Vegetarian
Unfertilized eggs
Science of eggs
Food classification
Egg versus milk debate

More Telugu News