నీటి సంక్షోభం: భారత్‌పై పాకిస్థాన్ కొత్త నాటకం.. అసలు కారణం ఇదే!

Pakistan Water Crisis New Drama Against India and the Real Reason
  • నీటి సంక్షోభంపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్‌ అంతర్జాతీయ ప్రచారం
  • దశాబ్దాల వైఫల్యాలు, నిధుల కోతతోనే పాక్‌లో తీవ్ర నీటి ఎద్దడి
  • ఉగ్రవాదం ఆగే వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ లేదన్న‌ భారత్
  • భారత్ తన వాటా నీటిని వాడుకునేందుకే ప్రాజెక్టులు నిర్మిస్తోందని స్పష్టీక‌ర‌ణ‌
  • ప్రావిన్సుల మధ్య వివాదాలు, నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడమే అసలు సమస్య
ఉగ్రవాదానికి పుట్టినిల్లుగా పేరుపడ్డ పాకిస్థాన్, ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు కొత్త ఎత్తుగడకు తెరలేపింది. తన దేశంలో నెలకొన్న తీవ్ర నీటి సంక్షోభానికి భారత్‌ కారణమంటూ ఓ కొత్త నాటకాన్ని రక్తి కట్టిస్తోంది. దేశంలో భరించలేని ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత ఏర్పడుతుందన్న భయంతో పాకిస్థాన్ హడావుడిగా ఓ అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. సింధు జలాల ఒప్పందాన్ని (ఐడ‌బ్ల్యూటీ) భారత్ నిలిపివేయడం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ప్రచారం చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. అయితే, వాస్తవానికి పాకిస్థాన్‌లో పెరుగుతున్న నీటి కష్టాలకు దాని దశాబ్దాల వైఫల్యాలే కారణం.

2025లో పహల్గామ్‌పై జరిగిన ఉగ్రదాడి తర్వాతే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు 26/11 ముంబై దాడులు, పుల్వామా దాడి వంటి అనేక ఘటనలు జరిగినా, 60 ఏళ్లకు పైగా భారత్ ఈ ఒప్పందాన్ని గౌరవిస్తూనే వచ్చింది. కానీ, పహల్గామ్ దాడి తర్వాత సహనం నశించి, "రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవు" అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఒప్పందాన్ని పునరుద్ధరించేది లేదని భారత్ స్ప‌ష్టం చేసింది. అయితే, ఈ వాస్తవాలను దాచిపెట్టి పాకిస్థాన్ మంత్రులు, బిలావల్ భుట్టో వంటి నేతలు అణుయుద్ధం వస్తుందంటూ బెదిరింపులకు దిగుతున్నారు.

పాకిస్థాన్ వైఫల్యాలే అసలు కారణం
పాకిస్థాన్ ఆరోపిస్తున్నట్టుగా ఈ నీటి సంక్షోభం భారత్ వల్ల వచ్చింది కాదు. దశాబ్దాలుగా నీటి యాజమాన్యాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన నిల్వ సామర్థ్యం లేకపోవడం, ప్రావిన్సుల మధ్య అంతర్గత వివాదాలే దీనికి మూల కారణాలు. గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది.

నిధుల కోత: పాకిస్థాన్ తన బడ్జెట్‌లో నీటి ప్రాజెక్టులకు కేటాయింపులను భారీగా తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 27% కోత విధించగా, ఆ తర్వాతి ఏడాది మరో 42 శాతం నిధులను తగ్గించింది. దీనివల్ల సుమారు 1.27 ట్రిలియన్ పాకిస్థానీ రూపాయల విలువైన నీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయాయి.

నిల్వ సామర్థ్యం లేకపోవడం: 1976లో టార్బెలా డ్యామ్ నిర్మించిన తర్వాత పాకిస్థాన్ దాదాపు అర్ధ శతాబ్దంగా ఒక్క పెద్ద నీటి నిల్వ ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. పైగా, టార్బెలా డ్యామ్‌లో పూడిక చేరడం వల్ల దాని నీటి నిల్వ సామర్థ్యం 48శాతం తగ్గిపోయింది.

నీటి వృథా: సింధు జలాల ఒప్పందం ప్రకారం భారత్‌కు కేటాయించిన మొత్తం నీటితో సమానమైన నీటిని పాకిస్థాన్ సముద్రంలోకి వృథాగా వదులుతోందని నిపుణులు చెబుతున్నారు. నీటి ఎద్దడి ఉన్న దేశంలో వరి, చెరకు వంటి అధిక నీటిని వినియోగించే పంటలను విరివిగా పండించడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.

అంతర్గత వివాదాలు: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ తనకు కేటాయించిన దానికంటే 20 శాతం ఎక్కువ నీటిని అక్రమంగా వాడుకుంటోంది. దీనివల్ల సింధ్, బలూచిస్థాన్ ప్రావిన్సులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. సింధ్‌లోని పలు కాలువల్లో నీటి కొరత 82శాతం వరకు చేరింది.

భారత్ వాదనలో స్పష్టత
1960 నాటి ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, సట్లెజ్, బియాస్‌లపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్‌పై పాకిస్థాన్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. అయితే, పశ్చిమ నదులపై భారత్ 'రన్-ఆఫ్-ది-రివర్' హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టులను నిర్మించుకోవచ్చు. భారత్ ఇప్పుడు నిర్మిస్తున్న షాహ్‌పూర్ కండి డ్యామ్ వంటి ప్రాజెక్టులు తన వాటాగా ఉన్న, ఇప్పటివరకు వినియోగించుకోని నీటిని వాడుకోవడానికే. గతంలో ఈ నీరు కూడా వృథాగా పాకిస్థాన్‌కే ప్రవహించేది. ఈ ప్రాజెక్టులతో పాకిస్థాన్ వాటా నీటిని అడ్డుకోవడం లేదు. పైగా, పాక్ ఆరోపిస్తున్నట్టు పశ్చిమ నదుల ప్రవాహాన్ని పూర్తిగా ఆపేంత మౌలిక సదుపాయాలు ప్రస్తుతం భారత్‌కు లేవు.

మొత్తంమీద పాకిస్థాన్ నీటి సంక్షోభం దాని స్వయంకృపరాధమే. ఉగ్రవాదంపై తన బాధ్యత నుంచి, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే భారత్‌పై నిందలు వేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.
Pakistan
Indus Waters Treaty
India Water Dispute
Pakistan Water Crisis
Shahpur Kandi Dam
Pahalgam Terror Attack

More Telugu News