ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. నివాళులు అర్పించిన కేంద్ర మంత్రి!

Ayatollah Seyyed Ali Khamenei farewell India pays rich tributes in Tehran
  • ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరైన భారత ప్రతినిధులు
  • కేంద్ర మంత్రి పబిత్ర మార్గరిట, బిహార్ గవర్నర్ సయ్యద్ హస్నైన్ నివాళులు
  • భారత ప్రభుత్వం, ప్రజల తరఫున సంతాపం తెలిపినట్లు వెల్లడి
  • ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీ మృతి
  • ఇరుదేశాల మధ్య ఉన్న నాగరిక బంధానికి ఇది నిదర్శనమని విదేశాంగ శాఖ ప్రకటన
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అంత్యక్రియల్లో భారత ప్రభుత్వం తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం పాల్గొని నివాళులర్పించింది. టెహ్రాన్‌లో జరుగుతున్న ఈ వీడ్కోలు కార్యక్రమాల్లో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా, బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నైన్ (రిటైర్డ్) పాల్గొని భారత్ తరఫున నివాళులు అర్పించారు. భారత ప్రభుత్వం, దేశ ప్రజల తరఫున తమ సంతాపాన్ని, గౌరవాన్ని తెలియజేసినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు.

అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలకు భారత్ తరఫున ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ బంధాన్ని, ప్రజా సంబంధాల ప్రాధాన్యతను ఈ పర్యటన తెలియజేస్తుందని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరు దేశాల రాజకీయ, ఆర్థిక బంధాలకు ఈ సంబంధాలే బలమైన పునాది అని స్పష్టం చేసింది.

శని, ఆదివారాల్లో (4-5)  టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని మొసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ వీడ్కోలు కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం 6న టెహ్రాన్‌లో, 7న ఖోమ్ నగరంలో అంత్యక్రియల ఊరేగింపులు నిర్వహిస్తారు. చివరగా 9న మషద్‌లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రంలో అంతిమ సంస్కారాలు, ఖనన ప్రక్రియ పూర్తి కానున్నాయి. గతంలోనే, భారత ప్రభుత్వ ప్రతినిధిగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి దిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించి, ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలీని కలిసి సంతాప పుస్తకంలో సంతకం చేసిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తుచేసింది.
Ayatollah Seyyed Ali Khamenei
Pabitra Margherita
India Iran Relations
Tehran Funeral Ceremony
Syed Ata Hasnain
Ministry of External Affairs

More Telugu News