హజ్ యాత్రికులకు రూ.లక్ష సాయం.. హామీ నెరవేర్చిన ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Government fulfills promise by providing 1 lakh aid to Haj pilgrims
విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లిన 333 మందికి రూ.లక్ష సాయం అందిందన్న హజ్ కమిటీ చైర్మన్
సీఎం చంద్రబాబు ఎన్నికల హామీని నెరవేర్చారని వెల్లడి
మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేరుగా ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారన్న చైర్మన్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రికులకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చింది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన 333 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ షేక్ హసన్ బాషా నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు.

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ పర్యవేక్షణలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పద్ధతిలో ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు బాషా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ సాయం అందించడం పట్ల యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 2,000 మంది హజ్ యాత్రకు వెళ్లారు. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల నుంచి బయలుదేరిన వీరంతా యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి వచ్చారు. అయితే, విజయవాడ నుంచి ప్రయాణించే వారికి అదనంగా రూ.68,000 వరకు వ్యయమవుతున్నందున, ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది కూడా 72 మంది యాత్రికులకు ఇదే తరహాలో సాయం అందించారు.

మక్కాలో ఉన్నప్పుడు రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు యాత్రికులు తెలిపారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, ఫరూఖ్‌లకు హజ్ కమిటీ తరఫున బాషా కృతజ్ఞతలు తెలియజేశారు.                                
Andhra Pradesh Government
Haj Pilgrims Financial Aid
Chandrababu Naidu
NMD Farooq
Vijayawada Haj Embarkation
Minority Welfare AP

More Telugu News