ఖమేనీ అంత్యక్రియలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న మనవరాలి శవపేటిక!
- ఇరాన్ అగ్రనేత అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు ప్రారంభం
- ఇజ్రాయెల్ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు మృతి
- 14 నెలల మనవరాలి చిన్నారి శవపేటికతో కంటతడి పెట్టిన ప్రజలు
- మరణించిన నాలుగు నెలల తర్వాత జరుగుతున్న అంతిమ సంస్కారాలు
ఇరాన్ జాతీయ పతాకంతో కప్పబడిన పెద్ద శవపేటికల మధ్య, అదే పతాకంతో ఉన్న చిన్నారి శవపేటిక చూపరుల హృదయాలను బరువెక్కిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 86 ఏళ్ల ఖమేనీతో పాటు ఆయన పెద్ద కుమార్తె, అల్లుడు, కోడలు (ప్రస్తుత అగ్రనేత అయతొల్లా మొజ్తబా ఖమేనీ భార్య), మనవరాలు జహ్రా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతితో ఇరాన్ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టిన తొలిరోజే ఈ దాడులు జరిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా నాలుగు నెలలకు పైగా ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను భద్రపరిచారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం సద్దుమణగడంతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. జూలై 9న మషద్‌లోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో వీరిని ఖననం చేయనున్నారు.