ట్రిపుల్ తలాక్ తదితర పద్ధతులపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
- ట్రిపుల్ తలాక్, హలాలా పేరుతో బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి
- పద్ధతుల ముసుగులో లైంగిక దోపిడీని అనుమతించలేమన్న కోర్టు
- కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశం
నికాహ్, హలాలా, ట్రిపుల్ తలాక్ వంటి పద్ధతులపై అలహాబాద్ హైకోర్టు అత్యంత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పద్ధతుల ముసుగులో మహిళలపై జరిగే లైంగిక దోపిడీని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించలేమని స్పష్టం చేసింది. ఇటువంటి చర్యలు సమాజపు ‘చీకటి అధ్యాయం’ అని, ఇవి రాజ్యాంగ విలువలకు, మానవ గౌరవానికి విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది. వ్యక్తిగత చట్టాల ముసుగులో నేరాలకు రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా ప్రాంతానికి చెందిన బాధితురాలికి 15 ఏళ్ల వయసులోనే బలవంతంగా వివాహం చేసి, ఆపై ట్రిపుల్ తలాక్, హలాలా పేరుతో పదే పదే లైంగిక దోపిడీకి గురిచేశారు. బాధితురాలు మైనర్‌గా ఉన్నప్పుడు అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ‘సెకండ్ హలాలా’, ‘డబుల్ హలాలా’ల పేరుతో ప్రధాన నిందితుడి సోదరుడు, మేనల్లుళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ దారుణ ఉదంతంపై స్పందించిన హైకోర్టు.. ఇప్పటివరకు వెల్లడైన వాస్తవాలు అత్యంత తీవ్రమైనవని పేర్కొంది. ఇది ఒక మైనర్‌పై పథకం ప్రకారం జరిగిన సామూహిక అత్యాచారాన్ని సూచిస్తోందని, దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఎఫ్‌ఐఆర్ రద్దు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇలాంటి సామాజిక అరాచకాలను ప్రాథమిక దశలోనే తుంచేయాలని, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరపాలని పోలీసులను ఆదేశించింది. కేసు కొట్టేయాలని, తమ అరెస్టులపై స్టే విధించాలని కోరూతూ నిందితులు వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.