నాకు భర్త మాత్రమే లేడు.. అన్నీ ఉన్నాయి: నందిని రెడ్డి

Nandini Reddy Says She Has Everything Except A Husband
  • 46 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న నందిని రెడ్డి
  • తన మెంటాలిటీకి సరిపోయే వ్యక్తి దొరకలేదని వెల్లడి
  • వీకెండ్స్‌లో ఇంట్లో ఒంటరిగా ఉంటానన్న నందిని

టాలీవుడ్‌లో ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’, 'మా ఇంటి బంగారం' వంటి ఫీల్ గుడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందిని రెడ్డి... తాజాగా ఒక పాడ్‌క్యాస్ట్‌లో తన వ్యక్తిగత జీవితం, పెళ్లి, ఒంటరితనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 46 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉండటంపై ఆమె ఎంతో బోల్డ్‌గా స్పందించారు.


"జీవితంలో పెళ్లి అనేది ‘డూ ఆర్ డై’ రూల్ కాదు. నా మెంటాలిటీకి సరిపోయే వ్యక్తి దొరకలేదు. నేను నచ్చిన వాళ్లతో నాకు సింక్ అవ్వలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు" అని నందిని రెడ్డి స్పష్టం చేశారు. ఒంటరితనం గురించి మాట్లాడుతూ... "జీవితం బాగుండడానికి కేవలం మొగుడు, పెళ్లాం బంధం ఒక్కటే సరిపోదు. నా చుట్టూ స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, కొలీగ్స్‌తో కూడిన అద్భుతమైన ప్రపంచం ఉంది. నా పక్కన లేనిది భర్త ఒక్కడే, మిగతా అన్నీ ఉన్నాయి. అందుకే నేనెప్పుడూ లోన్లీగా ఫీల్ అవలేదు" అని తెలిపారు.


ఆస్తులపై తనకు పెద్దగా వ్యామోహం లేదన్న నందిని రెడ్డి... ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కూడా తన అకౌంట్‌లో కేవలం రూ. 25 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలియకపోవడంతో ఒక స్నేహితురాలు బలవంతం చేసి రూ. 3 కోట్ల ఫ్లాట్ కొనిపించిందని, కోవిడ్ వల్ల పేమెంట్లు స్లో అవ్వడంతో ఎలాగోలా కట్టగలిగానని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. ప్రశాంతత కోసం కొన్ని లక్షలు వదిలేసుకోవడానికైనా తాను సిద్ధమేనన్నారు.


తనకు నాన్-ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎక్కువని, సినిమా పార్టీలకు దూరంగా ఉంటానని తెలిపారు. వీకెండ్స్‌లో ఇంట్లో ఒంటరిగా ఉంటూ.. తనకున్న నాలుగు కుక్కలతో గడపడం, ఇల్లు క్లీన్ చేయడం, వంట, పుస్తకాలు, మ్యూజిక్‌తో హ్యాపీగా గడిపేస్తానని చెప్పారు. తన మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ఎలాంటి వ్యక్తికైనా, పరిస్థితికైనా తన జీవితంలో స్థానం ఉండదని నందిని రెడ్డి తేల్చిచెప్పారు.

Nandini Reddy
Tollywood Director
Oh Baby Director
Nandini Reddy Interview
Nandini Reddy Marriage
Nandini Reddy Personal Life

More Telugu News