లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తా.. మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా?: జూపల్లి
- తెలంగాణ అప్పులపై చర్చకు తాను సిద్ధమన్న జూపల్లి
- సాయంత్రం 5 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు వస్తానన్న మంత్రి
- పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా తేల్చుకుందామని సవాల్
తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. "తెలంగాణ అప్పులపై చర్చకు నేను సిద్ధం. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తా. మరి బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమేనా?" అంటూ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.
"ఖబడ్దార్ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు. పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా తేల్చుకుందాం రండి" అని ధ్వజమెత్తారు. తన లెక్కలు తప్పు అయితే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు తక్షణమే రాజీనామా చేస్తానని, మరి వారి లెక్కలు తప్పైతే రాజీనామా చేస్తారా? బీఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు. కేసీఆర్ రాకపోతే జూపల్లి చెప్పే లెక్కలు నిజమేనని మీడియా ముందు ఒప్పుకోవాలని అన్నారు.
అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై కేటీఆర్, హరీశ్‌రావు ఒక్కొక్కరు ఒక్కో రకమైన అబద్ధపు లెక్కలు చెప్పారని జూపల్లి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంపై ఏకంగా రూ.8,21,651 కోట్ల అప్పుల భారం మోపారని ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్ల ద్వారా దొంగచాటుగా తెచ్చిన అప్పులను వీరు ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు.
తాను ఆత్మగౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యాపారాలు చేసుకుని రాజకీయాల్లోకి వచ్చానని.. పారిపోయే లక్షణం తనకు లేదని, అబద్ధాలు చెప్పే అలవాటు అంతకన్నా లేదని స్పష్టం చేశారు.