‘రామాలయ దోపిడీని హిందువులు క్షమించరు’.. బీజేపీపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్

Uddhav Thackeray says Hindus will not forgive the looting of Ram Temple
  • అయోధ్య రామాలయం చుట్టూ మరోసారి రాజకీయాలు
  • రామాలయ విరాళాలపై ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆరోపణలు చేశారు.
  • జూలై 5న 'రామ్ రక్ష' పేరుతో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి పిలుపు
  • దాదర్‌లోని హనుమాన్ ఆలయం వద్ద తొలి నిరసన
  • విరాళాల లెక్కలు చెప్పాలని డిమాండ్
అయోధ్య రామాలయానికి భక్తులు ఇచ్చిన విరాళాలను దోచుకున్నారంటూ బీజేపీపై శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. జులై 5న సాయంత్రం ముంబైలోని దాదర్ కబూతర్‌ఖానా హనుమాన్ ఆలయం వద్ద ‘రామ్ రక్ష’ నిరసన నిర్వహిస్తామని తెలిపారు.

పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉద్ధవ్ పిలుపునిచ్చారు. రామ్ రక్షా స్తోత్రం, హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తామని చెప్పారు. తాను స్వయంగా పార్టీ నేతలు, శివసైనికులతో కలిసి నిరసనకు నాయకత్వం వహిస్తానని వెల్లడించారు.

రామ జన్మభూమి ఉద్యమం వల్లే బీజేపీ ఎదిగిందని ఉద్ధవ్ అన్నారు. ఇప్పుడు అదే రామాలయ విరాళాలపై అవినీతి ఆరోపణలు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆలయ నిధులను రాజకీయ అవసరాలకు, ఇతర పార్టీల్లో చీలికలు తీసుకురావడానికి వినియోగిస్తున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు.

దాదర్‌లోని నిరసనతో ఉద్యమం ముగియదని ఉద్ధవ్ స్పష్టం చేశారు. అనంతరం మహారాష్ట్రలోని అన్ని జిల్లాలు, పట్టణాలు, గ్రామాల్లో రామాలయాలు, హనుమాన్ ఆలయాల వద్ద ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. రామాలయాన్ని దోచుకున్న వారిని హిందువులు క్షమించరని హెచ్చరించారు.
Uddhav Thackeray
Ayodhya Ram Mandir
BJP
Ram Mandir Donation Scam Allegations
Ram Raksha Protest Mumbai
Shiv Sena UBT

More Telugu News