అప్పుల లెక్కల్లో పొంతన లేదు.. మంత్రి చెప్పింది ఒకటి.. సీఎం చెప్పింది మరొకటి: హరీశ్ రావు
- రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్న హరీశ్ రావు
- సంగారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సులో ప్రభుత్వ తీరుపై విమర్శలు
- మంత్రి జూపల్లి లేఖ ప్రకారం అప్పు రూ.1.77 లక్షల కోట్లు అని వెల్లడి
- అసెంబ్లీలో సీఎం చెప్పిన అప్పు రూ.3.45 లక్షల కోట్లు అని గుర్తు చేసిన మాజీ మంత్రి
- ప్రభుత్వ పెద్దల లెక్కల్లోనే తేడాలు ఉన్నాయని ఆరోపణ
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం చేసిన అప్పు రూ. 1,77,058 కోట్లు అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తనకు లేఖ రాశారని తెలిపారు. అయితే, ఇదే అంశంపై నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం చేసిన అప్పు రూ. 3,45,294 కోట్లు అని చెప్పారని ఆయన గుర్తుచేశారు.
ఒకే ప్రభుత్వంలోని మంత్రి ఒక లెక్క, ముఖ్యమంత్రి మరో లెక్క చెప్పడం గందరగోళానికి దారితీస్తోందని హరీశ్ రావు అన్నారు. అప్పుల విషయంలో ప్రభుత్వ పెద్దలు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ లెక్కల్లో ఏది నిజమో ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.