రెండు సర్జరీలు చేశారు.. కోలుకోవడానికి 16 నెలలు పట్టింది: అఖిల్
- 'ఏజెంట్' సినిమా విడుదలైన తర్వాత బాత్రూమ్లో జారిపడ్డానన్న అఖిల్
- గాజు ముక్కలు గుచ్చుకుని ఎడమ చేయి తీవ్రంగా గాయపడిందని వెల్లడి
- ఏకంగా 48 కుట్లు వేశారని తెలిపిన అఖిల్
- అందుకే మరో సినిమాకు మూడేళ్ల గ్యాప్ వచ్చిందని వెల్లడి
తన కెరీర్లో మూడేళ్ల గ్యాప్ రావడంపై హీరో అక్కినేని అఖిల్ స్పందించాడు. "‘ఏజెంట్’ సినిమా విడుదలైన మూడు నెలలకు బాత్రూమ్లో ప్రమాదవశాత్తూ జారి పడ్డాను. గాజు ముక్కలు గుచ్చుకుని నా ఎడమ చేయి తీవ్రంగా గాయపడింది. ఆ ఘోర ప్రమాదం వల్ల ఎడమ చేతి వేళ్లకు రెండు మేజర్ మైక్రో సర్జరీలు చేయాల్సి వచ్చింది. ఏకంగా 48 కుట్లు పడ్డాయి. గాయం తీవ్రత కారణంగా కనీసం ఎనిమిది నెలల పాటు బరువులు కూడా ఎత్తలేకపోయాను. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 16 నెలల సమయం పట్టింది. అందుకే మూడేళ్ల పాటు కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాను" అని తెలిపాడు.
ఈ గ్యాప్ వల్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారనే విషయం తనకు తెలుసని అఖిల్ చెప్పాడు. అయితే, ఇకపై కెరీర్లో ఇలాంటి విరామాలు రాకుండా చూసుకుంటానని తెలిపాడు. అఖిల్ తాజా చిత్రం ‘లెనిన్’ ఈనె 10న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులను గుర్తుచేసుకున్నారు.
మరోవైపు, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న 'లెనిన్' చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందని, ఘన విజయం సాధిస్తుందని అఖిల్ ధీమా వ్యక్తం చేశాడు.