రూ.186 కుకీ దొంగతనం నెపం.. రూ.2 కోట్ల జీతం ఉన్న ఉద్యోగిని తీసేసిన ఫోర్డ్.. చివర్లో ఊహించని ట్విస్ట్!

Ford fires 2 crore salary employee over 186 rupee cookie theft allegation with a twist
  • రూ.186 కుకీ దొంగిలించాడనే ఆరోపణపై ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్
  • 11 ఏళ్లుగా పనిచేస్తూ.. రూ.1.9 కోట్ల వార్షిక జీతం అందుకుంటున్న ఉద్యోగి కుర్ట్ క్రోమ్
  • బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో తన నిజాయితీని నిరూపించుకున్న బాధితుడు
  • తప్పు తెలుసుకుని తిరిగి ఉద్యోగంలోకి పిలిచిన ఫోర్డ్ 
  • అంతకంటే మంచి ఉద్యోగంలో చేరిన క్రోమ్  
ప్రముఖ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్, తమ సంస్థలో పనిచేస్తున్న ఓ సీనియర్ ఉద్యోగి విషయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. కేవలం రూ. 186 విలువైన కుకీని దొంగిలించాడనే నిందతో 11 ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగిని విధుల నుంచి తొలగించింది. అయితే, ఆ ఉద్యోగి తన నిజాయతీని నిరూపించుకుని, కంపెనీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించి, అంతకంటే మెరుగైన ఉద్యోగంలో చేరి యాజమాన్యానికి షాక్ ఇచ్చారు.

అస‌లేం జ‌రిగిందంటే..!
కెంటకీలోని ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో 11 ఏళ్లుగా పనిచేస్తున్న 60 ఏళ్ల కుర్ట్ క్రోమ్, గతంలో వారానికి సగటున 60 గంటలు పనిచేసేవారు. ఆయన వార్షిక జీతం సుమారు $200,000 (దాదాపు రూ. 1.9 కోట్లు). ఒకరోజు పని మధ్యలో రక్తంలో చక్కెర స్థాయులు పడిపోవడంతో ఫ్యాక్టరీలోని క్యాంటీన్ కియోస్క్‌లో 1.95 డాల‌ర్ల విలువైన కుకీ కొనుక్కుని తిన్నారు.

అయితే, కొద్దిసేపటికే తనను ఆఫీస్‌కు పిలిపించిన అధికారులు, యూనియన్ ప్రతినిధి సమక్షంలో "నువ్వు కుకీ దొంగిలించావు. అందుకు వీడియో సాక్ష్యం ఉంది. నిన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం" అని చెప్పడంతో ఆయన నిర్ఘాంతపోయారు. "గత ఏడాది క్యాంటీన్‌లోనే 1,200 డాల‌ర్లు(దాదాపు రూ. 1.14 లక్షలు) ఖర్చు చేశాను. ఏడాదికి రూ.1.9 కోట్లు సంపాదించే నేను, కేవలం రూ.186 కుకీ కోసం దొంగతనం చేస్తానా?" అని ఆయన ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలని యూనియన్ ప్రతినిధి సూచించినా, చేయని తప్పుకు క్షమాపణ చెప్పేది లేదని క్రోమ్ స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను బలవంతంగా ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపించారు.

నిజాయతీని నిరూపించుకుని..
ఈ అవమానంతో కుంగిపోని క్రోమ్, తన డెబిట్ కార్డ్ బ్యాంక్ స్టేట్‌మెంట్ పరిశీలించారు. అందులో కుకీ కోసం 1.95 డాల‌ర్లు చెల్లించినట్లుగా లావాదేవీ నమోదై ఉంది. వెంటనే ఆ స్క్రీన్‌షాట్‌ను ఫోర్డ్ యాజమాన్యానికి, యూనియన్ ప్రతినిధికి పంపారు. అయినప్పటికీ ఫోర్డ్ యాజమాన్యం ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను నోటరీ చేయించి పంపాలని కోరింది.

ఈ నేపథ్యంలో కియోస్క్ ఆపరేటర్ అయిన అరామార్క్ సంస్థ.. క్రోమ్ కుకీ కోసం డబ్బులు చెల్లించాడని జూన్ 12న ఫోర్డ్‌కు అధికారికంగా ధ్రువీకరించింది. దీంతో తమ తప్పు తెలుసుకున్న ఫోర్డ్, క్రోమ్‌ను తిరిగి విధుల్లోకి చేరాలని కోరింది. కానీ, అప్పటికే ఆయనకు ఇంటికి దగ్గరలో అంతకంటే మంచి ఉద్యోగం వచ్చింది. ఫోర్డ్‌లో గంటకు 48 డాల‌ర్లు సంపాదించిన క్రోమ్, కొత్త ఉద్యోగంలో గంటకు 52.51 డాల‌ర్ల జీతంతో పాటు అదనంగా 10 డాల‌ర్ల బోనస్‌తో చేరారు. ఈ విధంగా తనపై వేసిన నిందను చెరిపేసుకోవడమే కాకుండా, తనను అవమానించిన కంపెనీ ఆఫర్‌ను తిరస్కరించి, ఉన్నతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు.
Kurt Chrome
Ford Motor Company
Employee fired for cookie
Wrongful termination news
Kentucky Ford truck factory
High salary employee fired

More Telugu News