రెండు, మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం: కేంద్రమంత్రి
- అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్థిరంగా కొనసాగడమే ఇందుకు కీలకం
- పాత నిల్వలు అధిక ధరకు కొన్నందున కంపెనీలకు భారీ నష్టాలు
- ఇప్పటికే పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గించిన నయారా ఎనర్జీ
- ఇప్పటికే తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడిచమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో కొనుగోలు చేసిన నిల్వలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం వినియోగిస్తున్నాయని మంత్రి వివరించారు. దీనివల్ల జూన్ 30 నాటికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై సుమారు రూ. 74,781 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని పేర్కొన్నారు. ధరల తగ్గింపుపై ఇప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటే అవుతుందని, అదంతా ముడిచమురు ధరల స్థిరత్వంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలావుండగా, ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ 'నయారా ఎనర్జీ' జూలై 1 నుంచి తన అవుట్‌లెట్లలో లీటరు పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 చొప్పున తగ్గించింది. గత రెండేళ్ల కాలంలో చమురు ధరలు తగ్గడం ఇదే తొలిసారి. అలాగే, వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను సైతం రూ. 183.50 మేర తగ్గించగా, గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు.
గత నాలుగేళ్లలో భారత్‌లో పెట్రోల్ ధరలు కేవలం 5.58 శాతం, డీజిల్ ధరలు 6.23 శాతం మేర మాత్రమే పెరిగాయని, అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో 20 శాతం, పొరుగు దేశాల్లో 35 శాతం వరకు పెరిగాయని మంత్రి గుర్తు చేశారు. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించి ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.12, డీజిల్ ధర రూ. 95.20 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.