ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం... 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేక‌ర్స్'పై జక్కన్న పేరు

SS Rajamouli receives rare honor in France at Institut Lumiere
  • ఫ్రాన్స్‌లో రాజమౌళికి అరుదైన అంతర్జాతీయ గౌరవం
  • లయోన్‌లోని 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేక‌ర్స్'‌పై దర్శకుడి పేరుతో ఫలకం
  • మార్టిన్ స్కోర్సెస్, క్లింట్ ఈస్ట్‌వుడ్ వంటి దిగ్గజాల సరసన చోటు
  • సినిమా పుట్టిన గడ్డపై దక్కిన గౌరవమిది
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. చలనచిత్ర రంగానికి పురిటిగడ్డగా భావించే ఫ్రాన్స్‌లోని లయోన్‌లో ఉన్న ప్రతిష్ఠాత్మక 'ఇన్‌స్టిట్యూట్ లుమియర్' ఆయన్ను ఘనంగా సత్కరించింది. అక్కడి ప్రఖ్యాత 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేక‌ర్స్' పై రాజమౌళి పేరుతో శాశ్వత స్మారక ఫలకాన్ని ప్రతిష్టించింది. ఈ అరుదైన గౌరవం ద్వారా మార్టిన్ స్కోర్సెస్సీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా వంటి ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకుల సరసన రాజమౌళి నిలిచారు.

జూలై 1, 2 తేదీల్లో జరిగిన ఈ వేడుక అనంతరం రాజమౌళి తన అనుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

"లుమియర్ మ్యూజియంను సందర్శించాను. నా సినిమాలు 'ఈగ', 'ఆర్ఆర్ఆర్' ప్రదర్శితమవుతున్న స్క్రీనింగ్ రూమ్‌కు వెళ్ళిన సమయంలో ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ థియరీ ఫ్రెమాక్స్ నన్ను అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేసి, ఒక సర్‌ ప్రైజ్ ఉందని చెప్పారు. నన్ను సినిమా పుట్టిన వీధిలోకి తీసుకెళ్లగా, అక్కడ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుల పేర్లతో కూడిన ఫలకాలు కనిపించాయి. ఎరుపు రంగు వస్త్రంతో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. దానిపై నా పేరు చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఈ అరుదైన గౌరవానికి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని రాజమౌళి వివరించారు.

ఇటీవలే పారిస్‌లోని 'సినీమాథెక్ ఫ్రాన్సైస్'‌ థియేటర్‌లో రాజమౌళి పేరుతో ఒక శాశ్వత సీటును కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గౌరవంతో ఆయన అంతర్జాతీయ ఖ్యాతి మరో మెట్టు ఎక్కింది. జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య వరకు ఇన్‌స్టిట్యూట్ లుమియర్ రాజమౌళి చిత్రాలైన 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' వంటి చిత్రాలతో ప్రత్యేక 'రెట్రోస్పెక్టివ్‌'ను నిర్వహిస్తోంది.
SS Rajamouli
Institut Lumiere
Wall of Filmmakers
Lyon France
RRR Director
Indian Cinema

More Telugu News