భారత్ ట్రిప్ తర్వాత బ్రిటన్ మహిళకు నరకం... మెదడులో 38 పరాన్నజీవులు!

British woman faces hell after India trip with 38 parasites in brain
  • భారత్ పర్యటన తర్వాత బ్రిటన్ మహిళకు అరుదైన ఇన్ఫెక్షన్
  • పొట్టలోంచి బయటపడ్డ మీటరు పొడవు టేప్‌వార్మ్
  • వైద్య పరీక్షల్లో మెదడులో 38 పరాన్నజీవి తిత్తుల గుర్తింపు
  • పదేళ్లపాటు మూర్ఛ, మానసిక సమస్యలతో తీవ్ర పోరాటం
  • ప్రస్తుతం కోలుకున్నా కొనసాగుతున్న మూర్ఛ వ్యాధి మందులు
దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో పర్యటించిన ఓ బ్రిటిష్ మహిళ, ఆ పర్యటన తన జీవితాన్ని పదేళ్ల పాటు ఎలా నరకప్రాయం చేసిందో తాజాగా వెల్లడించారు. ఆ సమయంలో ఆమె శరీరంలోకి ప్రవేశించిన ఒక పరాన్నజీవి కారణంగా మెదడులో ఏకంగా 38 పరాన్నజీవులు అభివృద్ధి చెంది, ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

వేల్స్‌కు చెందిన 42 ఏళ్ల లోరీ డెన్‌మన్, 2007లో భారత్‌లో రెండు నెలల పాటు పర్యటించారు. ఆమె శాకాహారి అయినప్పటికీ, కలుషితమైన ఆహారం లేదా నీటి ద్వారా 'టీనియా సోలియం' అనే పరాన్నజీవి లార్వా ఆమె శరీరంలోకి ప్రవేశించింది. దీనివల్ల ఆమె 'న్యూరోసిస్టోసెర్కోసిస్' అనే అరుదైన ఇన్‌ఫెక్షన్‌ ఆమె బారిన పడ్డారు.

పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిన కొన్నేళ్ల తర్వాత, 2010లో ఒక రెస్టారెంట్ టాయిలెట్‌లో ఆమె శరీరం నుంచి సుమారు మీటరు పొడవున్న టేప్‌వార్మ్ (బద్దె పురుగు) బయటకు వచ్చింది. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ, అప్పట్లో అంతా సాధారణంగానే ఉందని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఏడాది తిరిగేసరికి తీవ్రమైన తలనొప్పి, సంభాషించడంలో ఇబ్బందులు, మూర్ఛ వంటి తీవ్ర లక్షణాలు మొదలయ్యాయి.

స్కానింగ్ నిర్వహించగా ఆమె మెదడులో 38 పరాన్నజీవులు ఉన్నట్లు తేలడంతో వైద్యులు, కుటుంబం సభ్యులు విస్మయానికి గురయ్యారు. దాదాపు పదేళ్ల పాటు యాంటీ-పారాసైటిక్ మందులు, స్టెరాయిడ్స్‌తో చికిత్స పొందినప్పటికీ పదేపదే మూర్ఛ రావడం, గందరగోళం, తీవ్ర ఆందోళన, సైకోసిస్ వంటి మానసిక సమస్యలతో ఆమె పోరాడారు. ఒకానొక దశలో ఆమె తన తండ్రి ఇంట్లో చిన్నపిల్లలా నేలపై పాకడం, దాక్కోవడం వంటివి చేసేవారని ఆమె స్నేహితురాలు గుర్తుచేసుకున్నారు.

ఎట్టకేలకు శస్త్రచికిత్స అవసరం లేకుండానే వైద్యంతో ఆ పరాన్నజీవులు నిర్వీర్యమై క్యాల్సిఫై అయ్యాయి. 2017 నుంచి తనకు మూర్ఛ రాలేదని, అయితే ఇప్పటికీ ప్రతిరోజూ మందులు వాడుతున్నానని లోరీ వెల్లడించారు. 

ఈ భయానక అనుభవం తన జీవితాన్ని తలకిందులు చేసిందని, తన మీడియా కెరీర్‌ను కూడా వదులుకోవాల్సి వచ్చిందని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రస్తుతం నేను జీవించి ఉన్నందుకు, ఆరోగ్యంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఈ విషయాన్ని ఇకపై ఎప్పుడూ తేలికగా తీసుకోను" అని ఆమె పేర్కొన్నారు. పర్యటనల సమయంలో సోకే ఇన్‌ఫెక్షన్లు ఎంత ప్రమాదకరంగా మారుతాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Lorie Denman
Neurocysticercosis
Brain Parasite
India Trip Infection
Tapeworm Cysts
British Woman Health

More Telugu News