ఉద్యోగాలు అడిగేవారు కాదు.. ఇచ్చేవారుగా యువత ఎదగాలి: మంత్రి లోకేశ్‌

Nara Lokesh says youth should become job creators not job seekers
  • ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' స్ఫూర్తితో 'స్వర్ణాంధ్ర-2047' నిర్మాణమ‌న్న‌ మంత్రి
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం యువతకు గొప్ప ఆదర్శమని వెల్లడి
  • ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలని యువతకు పిలుపు
  • ఏపీని ఇన్నోవేషన్, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ గమ్యస్థానంగా మార్చుతామని స్పష్టీకరణ
  • అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేశ్‌
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో చేపట్టిన 'వికసిత్ భారత్ 2047' స్ఫూర్తితో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'స్వర్ణాంధ్ర-2047' లక్ష్యం దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. విద్య, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తుకు సంసిద్ధమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురంలోని ఏపీ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.

రాష్ట్రపతి ముర్ము జీవితమే ఒక పాఠం
ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వేదిక పంచుకోవడం గొప్ప భాగ్యమని లోకేశ్‌ అన్నారు. ఆమె జీవితం తరగతి గదుల్లో నేర్చుకోలేని ఒక గొప్ప పాఠమని అభివర్ణించారు. "ఒక చిన్న గిరిజన గ్రామంలో పుట్టి, ఎన్నో వ్యక్తిగత విషాదాలను ఎదుర్కొని, విశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగారు. ఉపాధ్యాయురాలిగా, శాసనసభ్యురాలిగా, గవర్నర్‌గా పనిచేసి, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా మన ముందున్నారు. ఆమె ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక సత్యాన్ని బోధిస్తుంది. మన నేపథ్యం మన గమ్యాన్ని నిర్ధారించదు, మన ధైర్యమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆమె జీవితం లక్షలాది మంది భారతీయ యువతకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది" అని లోకేశ్‌ వివరించారు.

చారిత్రాత్మకం.. తొలి బ్యాచ్
ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు. "ప్రతి స్నాతకోత్సవం ప్రత్యేకమైనదే అయినా, మొదటిది ఎప్పటికీ చారిత్రాత్మకం. చరిత్ర ఒక్కసారే లిఖించబడుతుంది. రాబోయే ఏళ్లలో వేలమంది ఇక్కడి నుంచి పట్టాలు అందుకుంటారు. కానీ, మొదటి బ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ వారసత్వం మీకే చెందుతుంది" అంటూ పట్టభద్రులకు, స్వర్ణ పతక విజేతలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఉద్యోగ సృష్టికర్తలుగా ఎదగండి
మారుతున్న ప్రపంచంలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారిగా కాకుండా, అవకాశాలను సృష్టించే వారిగా మారాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు. "కేవలం ఉద్యోగార్థులుగా ఉండకండి, ఉద్యోగ సృష్టికర్తలుగా మారండి. సంస్థలను, ఆవిష్కరణలను, పరిష్కారాలను నిర్మించండి. ఎప్పుడూ సౌకర్యవంతమైన మార్గాన్ని ఎంచుకునే వారికి విజయం దక్కదు. కఠినమైన, తక్కువ మంది ప్రయాణించే మార్గాన్నే ఎంచుకోండి. అవే అద్భుతమైన విజయాలకు దారితీస్తాయి. వైఫల్యాలను తట్టుకుని నిలబడే ధైర్యం, మళ్లీ పుంజుకునే సంకల్పం కలిగి ఉండాలి" అని ఆయన సూచించారు. స్నాతకోత్సవంతో విద్య ముగిసిపోదని, ఇది జీవితకాల అభ్యసనకు నాంది మాత్రమేనని గుర్తుచేశారు.

టెక్నాలజీ హబ్‌గా ఏపీ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ రంగాలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని లోకేశ్‌ తెలిపారు. సాంకేతికత, తయారీ, పరిశోధన, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు రానున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. "ఈ ప్రాంగణం నుంచి వెళ్తున్న మీరు మీ విజ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో, విలువలను వినయంతో, కలలను ధైర్యంతో ముందుకు తీసుకువెళ్లండి. మీ కుటుంబం, మీ విశ్వవిద్యాలయం, ఈ దేశం గర్వపడేలా గొప్ప వారసత్వాన్ని సృష్టించండి" అని లోకేశ్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
Droupadi Murmu
AP Central University Anantapur
Swarnandhra 2047
Job Creators
Andhra Pradesh Education Minister

More Telugu News