ఓర్చుకోలేక బీజేపీ నేతలు మూర్ఖపు విమర్శలు చేస్తున్నారు: మల్లు రవి
- తెలంగాణలో రాముడి ఆదర్శ పాలన సాగుతోందన్న మల్లు రవి
- అయోధ్య రాముడి సొమ్మును బీజేపీ దిగమింగిందని ఆరోపణ
- రాహుల్ ప్రధాని కావడం ఖాయమని ధీమా
తెలంగాణలో సాగుతోంది రాముడి ఆదర్శ పాలన అని ఆ పార్టీ సీనియర్ నేత, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. దేవుడి సొమ్మును కూడా దిగమింగిన బీజేపీకి ఇక పుట్టగతులుండవు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సర్వజన సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతుంటే, ఓర్వలేక బీజేపీ నేతలు మూర్ఖపు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో ఉనికి కోసం ఆరాటపడుతున్న బీజేపీ... దేశంలో అత్యంత అవినీతి, నియంతృత్వ ధోరణులతో ఒక 'రావణాసుర పాలన' సాగిస్తోందని మల్లు రవి ధ్వజమెత్తారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన ఒక 'అట్టర్ ప్లాప్ షో' అని ఎద్దేవా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ను గద్దె దించడం ఎవరి వల్లా కాదని, తెలంగాణ సమాజం మత విద్వేష రాజకీయాలను ఎన్నటికీ ఆదరించదని స్పష్టం చేశారు.
అయోధ్య రాముడి పేరుతో 40 ఏళ్లుగా రాజకీయం చేస్తున్న బీజేపీ... చివరకు ఆ దేవుడి సొమ్మును కూడా వదలకుండా మింగేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వయంగా యూపీలోని అయోధ్య వాసులే ఆ పార్టీ అవినీతిపై ఆగ్రహంతో ఉన్నారని, దేశంలో కమలం పార్టీకి కాలం చెల్లిందన్నారు. విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి రాబోయే సార్వత్రిక ఎన్నికలే చివరివని, త్వరలోనే దేశం 'బీజేపీ ముక్త్ భారత్' కాబోతుందని జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీయడం, రాహుల్ గాంధీ ప్రధాని పీఠాన్ని అధిరోహించడం ఖాయమని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు.