నాన్న నాతో అలా ఎప్పుడూ చెప్పలేదు: ఎస్పీ చరణ్!

S P Charan Interview
  • అప్పట్లో తన తండ్రి చాలా బిజీ అని వెల్లడి
  • ఆయన గొప్పతనం తమకి తెలిసేది కాదన్న చరణ్  
  • తనని ఎప్పుడూ కంగారు పెట్టలేదని వ్యాఖ్య
  • ఆయనలా పాడుతున్నానని అంటుంటే ఆశ్చర్యంగా ఉందని వివరణ

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం .. తెలుగు పాటకు తేనె వంటి స్వరంతో అభిషేకం చేసిన గాయకుడు. పొలం గట్లపై కన్నెపిల్లలా తెలుగు పాటను పరిగెత్తించిన మధుర గాయకుడు. అలాంటి గాయకుడి తనయుడైన చరణ్ కూడా, గాయకుడిగా తనదైన ముద్రవేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన పాడిన మెలోడీస్ కొన్ని యూత్ హృదయాలలో మ్రోగుతూనే ఉన్నాయి. అలాంటి చరణ్ తాజాగా 'ప్రేమ ది జర్నలిస్ట్' యూ ట్యూబ్ ఛానల్ కి వచ్చిన ఇంటర్వ్యూలో తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

" మా చిన్నప్పుడు సింగర్ గా నాన్నగారు చాలా బిజీ. ఉదయం వెళితే ఏ రాత్రికో వచ్చేవారు. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది గొప్పవాళ్లను ఆయన కలుస్తూ ఉండేవారు. పెద్ద పెద్ద హీరోలతో కలిసి పనిచేస్తూ ఉండేవారు. వాళ్ల ఇళ్లకు మేము వెళుతూ ఉండేవాళ్లం .. వాళ్లు కూడా మా ఇంటికి వస్తుండేవారు. అయితే ఇదంతా మాకు చాలా సహజంగా అనిపించేది. అందువలన నేను గానీ .. మా సిస్టర్ గాని మేము బాలుగారి పిల్లలమని చెప్పుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. అదో అద్భుతమని కూడా మాకు తెలియదు" అని అన్నారు. 

" నేను సింగర్ గా పాడవలసి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే బాలుగారి అబ్బాయి అంటే అందరికీ అంచనాలు ఉంటాయి. అందువలన చాలా ఒత్తిడికి గురయ్యేవాడిని. 'నువ్వు బాలుగారి అబ్బాయివి .. ఆ స్థాయిలో పాడాలి మరి' అని నాన్న ఎప్పుడూ కంగారు పెట్టేవారు కాదు. కెరియర్ ను సీరియస్ గా తీసుకుంటే మిగతావన్నీ దార్లో పడిపోతాయని కూల్ గా చెప్పేవారు. అప్పటి కంటే ఇప్పుడు కాస్త బెటర్ గా పాడగలుగుతున్నాను. కాకపోతే అచ్చు నాన్నలా పాడుతున్నానని అందరూ అంటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పారు. 

SP Charan
SP Balasubrahmanyam
Telugu playback singer
Prema the Journalist interview
SPB son memories
SP Charan singing career

More Telugu News