రైతులకు తెలంగాణ సర్కార్ శుభవార్త.. 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమ
- రైతు భరోసా కింద 9 రోజుల్లో రూ.9000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్న సీఎం రేవంత్
- వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సూచించిన వరి వంగడాలనే పండించాలని రైతులకు విజ్ఞప్తి
- గత 30 నెలల్లో రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడి
- రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి
- కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిపోయిందని రేవంత్ విమర్శ
రైతు భరోసాకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, రైతు వేదికల వద్ద నాణ్యమైన వరి విత్తనాలను సిద్ధం చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం గత 30 నెలల కాలంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. 25.35 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.20,000 కోట్ల రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.36,000 కోట్లు జమ చేశామని, ఇందులో తాము అధికారంలోకి రాగానే విడుదల చేసిన రూ.7,000 కోట్లు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమం కోసం తాము నెలకు రూ.6,000 కోట్లు ఖర్చు చేస్తుంటే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.2,000 కోట్లు మాత్రమే వెచ్చించిందని పోల్చి చెప్పారు. రైతు సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, తమ రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
కేసీఆర్ హయాంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్ర అప్పు రూ.8.11 లక్షల కోట్లకు చేరిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ పనులను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.