షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బీజేపీ నేత మాధవీలత సంచలనం.. స్వర్ణ పతకంతో రికార్డ్!
- రాష్ట్ర స్థాయి షూటింగ్లో స్వర్ణ పతకం
- 25 మీటర్ల పిస్టల్ విభాగంలో విజయం
- భుజం గాయంతోనూ కఠిన సాధన
- నేషనల్స్ లక్ష్యంగా తదుపరి అడుగులు
- అఖాడా సంప్రదాయంపై ప్రత్యేక ప్రశంసలు
చిన్నతనంలో ఎన్సీసీ కేడెట్‌గా ఉన్నప్పుడు రిపబ్లిక్ డే శిక్షణ తరగతుల్లో రైఫిల్ ప్రాక్టీస్ చేశానని, అప్పుడే ఈ క్రీడపై తనకు ఆసక్తి కలిగిందని మాధవీలత గుర్తు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు ప్రజలకు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతోనే తాను మళ్లీ షూటింగ్ రేంజ్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు. ఒక రాజకీయ నాయకుడికి సాహస గుణం, క్రీడా స్ఫూర్తి ఉండాలని.. వయసు అనేది దేనికీ అడ్డంకి కాదని ఆమె పేర్కొన్నారు. మానసికంగా సిద్ధమైతే ఏదైనా సాధించవచ్చని చెబుతూ, ఈ విజయానికి తన కోచ్ ప్రసన్న అందించిన మార్గదర్శకత్వమే కారణమని ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
గాయాన్ని లెక్కచేయకుండా నేషనల్స్ వైపు
ప్రస్తుతం కుడి భుజానికి లిగమెంట్ గాయం ఉన్నప్పటికీ.. మాధవీలత ఏమాత్రం తగ్గకుండా తదుపరి లక్ష్యాల కోసం కఠినమైన శిక్షణ తీసుకుంటున్నారు. మరో రెండు నెలల్లో జరగనున్న ప్రి-నేషనల్ ఛాంపియన్షిప్స్ కోసం ఆమె జిమ్‌లో ముమ్మరంగా శ్రమిస్తున్నారు. పట్టుదల ఉంటే ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించవచ్చని నిరూపించడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. "ఈ స్వర్ణ పతకం కేవలం నా ఒక్కదాని విజయం కాదు. నన్ను నమ్మి, ప్రోత్సహించి, నా ప్రయాణంలో తోడు నిలిచిన ప్రతి ఒక్కరిదీ. కలలను నిజం చేసుకోవాలనుకునే ప్రతి మహిళకు నేను చెప్పేది ఒక్కటే.. మీ హద్దులను ఎవరినీ నిర్ణయించనివ్వకండి. మీపై నమ్మకంతో శ్రమించండి, ఉన్నత శిఖరాలను అందుకోండి" అని సోషల్ మీడియా వేదికగా సందేశాన్ని ఇచ్చారు.
మరోవైపు 1975 నుంచి క్రమశిక్షణ, దేశభక్తిని నూరిపోస్తున్న 'ఉప్రాస్ వ్యాయామ శాల'ను సందర్శించిన దృశ్యాలను ఆమె పంచుకున్నారు. అక్కడ అఖాడా సంప్రదాయాన్ని కాపాడుతున్న గురువులు, శిక్షకులు, యువ అథ్లెట్లను అభినందించారు. ఇటువంటి సంస్థలు కేవలం శారీరక దారుఢ్యాన్నే కాకుండా, యువతలో నైతిక విలువలను, దేశభక్తిని పెంపొందిస్తాయని, యువత శక్తే దేశ శక్తి అని మాధవీలత కొనియాడారు.