ఏపీఎల్ ఛాంపియన్‌గా భీమవరం బుల్స్.. వైజాగ్‌పై ఘనవిజయం..ట్రోఫీ అందించిన మంత్రి నారా లోకేశ్

Bhimavaram Bulls win APL title against Vizag as Minister Nara Lokesh presents trophy
  • ఫైనల్లో వైజాగ్ లయన్స్‌పై ఏకపక్ష విజయం
  • ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీ అందించిన మంత్రి లోకేష్
  • 60 రోజుల్లో పునరుద్ధరించిన మంగళగిరి స్టేడియంలో ఫైనల్స్
మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఫైనల్స్ ఐపీఎల్ వేడుకలను తలపించేలా అత్యంత వైభవంగా జరిగాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, జీఎంఆర్ (GMR) సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా ఫైనల్‌కు వేలాది మంది క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. ప్రేక్షకుల కేరింతలు, యువత ఉత్సాహం, ఆకట్టుకునే డ్రోన్ షో, విద్యుద్దీపాల కాంతులతో స్టేడియం మొత్తం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు విచ్చేసిన రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన రాకతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.



**లోకేష్ చేతుల మీదుగా తుది పోరుకు శ్రీకారం**

టాస్ నిర్వహించి సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్ జట్ల మధ్య తుది పోరును మంత్రి లోకేష్ ప్రారంభించగా, టాస్ గెలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లను అభినందించిన లోకేష్, క్రీడాస్ఫూర్తితో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలని ఆకాంక్షించారు. ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగి అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రతి బౌండరీకి కేరింతలు, ప్రతి వికెట్‌కు హర్షధ్వానాలతో స్టేడియం సందడిగా మారింది. ప్రత్యేకంగా నిర్వహించిన డ్రోన్ షో ఏపీఎల్ ఫైనల్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.



**భీమవరం బుల్స్ దూకుడు... సింహాద్రి వైజాగ్ లయన్స్‌పై ఘన విజయం**

ఫైనల్ మ్యాచ్‌లో భీమవరం బుల్స్ జట్టు ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సింహాద్రి వైజాగ్ లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భీమవరం బుల్స్ బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్‌తో కేవలం 9 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని నమోదు చేశారు. భీమవరం బుల్స్ విజయంలో రేవంత్ రెడ్డి, హేమంత్ రెడ్డి మెరుపు ఇన్నింగ్స్‌లు ప్రధాన బలంగా నిలిచాయి. వీరిద్దరూ అతి తక్కువ బంతుల్లోనే అర్ధశతకాలు పూర్తి చేసి ప్రత్యర్థి బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. వీరి అద్భుత బ్యాటింగ్‌తో భీమవరం బుల్స్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుని ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ఛాంపియన్‌గా అవతరించింది.



మ్యాచ్ అనంతరం విజేతగా నిలిచిన భీమవరం బుల్స్, రన్నరప్‌గా నిలిచిన సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లకు మంత్రి నారా లోకేష్ ట్రోఫీలను అందజేశారు. టోర్నమెంట్‌లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు అవార్డులు, నగదు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు, ఎంపీ మతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో కలిసి ఆయన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు.



**క్రీడాభివృద్ధి సంకల్పానికి ప్రతీకగా నిలిచిన మంగళగిరి స్టేడియం**

గత ఐదేళ్లుగా నిర్లక్ష్యానికి గురై శిథిలావస్థకు చేరిన మంగళగిరి ఏసీఏ స్టేడియం నేడు సరికొత్త రూపుతో అందరినీ ఆకట్టుకుంది. కేవలం 60 రోజుల్లోనే డ్రైనేజీ వ్యవస్థ, అంతర్గత రహదారులు, ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూములు, ప్రేక్షకుల సౌకర్యాలు సహా ఇతర ఆధునిక వసతులను అభివృద్ధి చేసి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని సిద్ధం చేయడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఒకప్పుడు నిరాదరణకు గురైన ఈ క్రీడా వేదిక నేడు రాష్ట్రంలో క్రీడల పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి మరో మైలురాయిగా నిలిచేలా మంగళగిరిలోని ఏసీఏ క్రీడా ప్రాంగణంలో ఆధునీకరించిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్మారక ఫలకాన్ని మంత్రి లోకేష్ ఘనంగా ఆవిష్కరించారు. అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దిన ఈ స్టేడియం భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్‌లకు, యువ క్రికెటర్ల శిక్షణకు ప్రధాన కేంద్రంగా మారనుందని ఆయన పేర్కొన్నారు.



చివరగా, ఏపీఎల్‌ను అత్యంత విజయవంతంగా నిర్వహించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA), ఏపీఎల్ నిర్వాహకులు, అధికారులు, క్రీడాకారులు, సిబ్బందిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు.
Nara Lokesh
Bhimavaram Bulls
Andhra Premier League
APL Finals
Mangalagiri ACA Stadium
Simhadri Vizag Lions

More Telugu News