పెళ్లి బరాత్‌పై తుపాకులతో దాడి: ఒకరి మృతి.. వధువు నగలు లూటీ
- బిహార్‌లోని పెళ్లి వేడుకపై సాయుధ దాడి
- కాల్పుల్లో వధువు మేనత్త దుర్మరణం
- ముగ్గురు కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు
- పెళ్లి నగలు దోచుకెళ్లిన దుండగులు
- పరారీలో నిందితులు.. పోలీసుల గాలింపు
పోలీసుల కథనం ప్రకారం.. గిద్ధౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేవా గ్రామానికి చెందిన శ్యామ్‌దేవ్ యాదవ్ కుమార్తె వివాహం సోమవారం రాత్రి జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని, మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వధూవరులను, బంధువులను ఊరేగింపుగా తీసుకువెళ్తుండగా సాయుధ దుండగులు కొందరు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు.
పెళ్లి బృందంపై దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వధువు మేనత్త కమలా దేవి (48) బుల్లెట్ గాయాలతో ఘటన స్థలంలోనే మరణించింది. శ్యామ్‌దేవ్ యాదవ్ కుమారుడు ప్రమోద్ యాదవ్, బంధువులు అమిత్ యాదవ్, సుశీల్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. దాడి అనంతరం దుండగులు వధువుకు చెందిన విలువైన బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం జామూయ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.