అమెరికా వర్సెస్ ఇరాన్: దోహా చర్చలపై తీవ్ర గందరగోళం!
- దోహాలో ఇరాన్‌తో చర్చలన్న ట్రంప్
- సమావేశం ఏదీ లేదన్న ఇరాన్
- పరస్పర ప్రకటనలతో దౌత్యపరమైన గందరగోళం
- రాజకీయ అస్థిరతలో తాత్కాలిక కాల్పుల విరమణ
- మధ్యవర్తుల ద్వారా విడివిడిగా భేటీలు
వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అణు కార్యక్రమంపై దోహాలో రేపు (బుధవారం) ఒక సమావేశం జరగబోతోందని ప్రకటించారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని తాము అంగీకరించబోమని, ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. దీనికంటే ముందే, ఇరానే స్వయంగా చర్చల కోసం అభ్యర్థించిందని, రేపు దోహాలో భేటీ ఉంటుందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడించారు.
అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో అమెరికాతో ఎలాంటి చర్చలు ప్రణాళికలో లేవని, ఏ స్థాయిలోనూ వారితో భేటీలు జరగవని స్పష్టం చేశారు. తమ సాంకేతిక బృందం ఈ వారం ఖతార్ వెళ్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దానికి అమెరికా అధికారుల రాకతో ఎలాంటి సంబంధం లేదని, దీనిని ద్వైపాక్షిక చర్చలుగా భావించలేమని ఆయన తోసిపుచ్చారు.
అయినప్పటికీ, దోహాలో మంగళవారం చర్చలు జరిగే అవకాశం ఉందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి రాయిటర్స్‌తో పేర్కొనడం గమనార్హం. ఈ చర్చలు గతంలో స్విట్జర్లాండ్‌లో జరిగిన సాంకేతిక చర్చల్లా కాకుండా, అంతర్జాతీయంగా కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించడం, స్థిరత్వాన్ని తీసుకురావడంపైనే కేంద్రీకృతమవుతాయని సదరు అధికారి వెల్లడించారు. మరోవైపు, అమెరికా-ఇరాన్ సాంకేతిక బృందాలు బుధవారం ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తులతో విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉందని సమాచారం. అమెరికా తరఫున అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు.
గత నాలుగు నెలలుగా సాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని పరీక్షించేలా.. గత వారాంతంలో ఇరు దేశాల మధ్య క్షిపణులు, డ్రోన్ల దాడులు జరిగాయి. హర్మూజ్ ప్రాంతంలో రెండు వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపిస్తూ అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేయగా, ప్రతిచర్యగా ఇరాన్ కూడా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమం, ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరపడానికి ఈ కాల్పుల విరమణ ఒక సదవకాశంగా భావించినప్పటికీ, ఇరుపక్షాలు పరస్పరం నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించుకుంటున్నాయి. ఈ తరుణంలో దోహా చర్చలపై నెలకొన్న గందరగోళం ప్రాంతీయ శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తోంది.