కష్టపడి చదవండి.. మీ కలలు నెరవేర్చే బాధ్యత నాది: మంత్రి నారా లోకేశ్

Study hard I will take responsibility to fulfill your dreams says Minister Nara Lokesh
  • త్వరలో రాష్ట్ర విద్యారంగంలోకి ఏఐ ట్యూటర్‌ను తీసుకొస్తామని ప్రకటన
  • సమాజంలో మార్పు కోసం కొంతమంది విద్యార్థులైనా రాజకీయాల్లోకి రావాలని పిలుపు
  • షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలు విని తక్షణ సాయంపై హామీలు
  • ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడి
"మీరు కష్టపడి చదవండి.. విద్యాశాఖ మంత్రిగా మీ కలలను సాకారం చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను" అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సమాజంలో మార్పు కోసం యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. గత ఏడాది టెన్త్, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమం ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా, ఆసక్తికరంగా సాగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 'డ్రీమ్ వాల్స్', 'గ్రాటిట్యూడ్ వాల్స్'పై విద్యార్థులు రాసిన మాటలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని లోకేశ్ తెలిపారు. విద్యార్థులు అద్భుతమైన సలహాలు ఇచ్చారని, వారిలో కొంతమంది అయినా రాజకీయాల్లోకి వస్తేనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. తాను రాజకీయాల్లో ఉండటం వల్లే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విద్యా సంస్కరణలు ఏపీలో తీసుకురాగలుగుతున్నానని అన్నారు.

త్వరలో ఏఐ ట్యూటర్.. బలోపేతం కానున్న గ్రంథాలయాలు
వివిధ జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఆకాంక్షలు, సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కాకినాడకు చెందిన క్రాంతి అనే విద్యార్థి స్కూలు స్థాయి నుంచే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై శిక్షణ, మోటివేషన్ క్లాసులు, లైబ్రరీల అవసరాన్ని ప్రస్తావించారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ.. రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని, పుస్తకాలు చదవడం ద్వారా సృజనాత్మకత పెరుగుతుందని అన్నారు. 

మండలం, నియోజకవర్గం, జిల్లా, జోనల్ స్థాయిలో లైబ్రరీలను బలోపేతం చేస్తామని, ఏడాదిలోగా అమరావతిలో ప్రపంచస్థాయి గ్రంథాలయాన్ని నిర్మించబోతున్నామని హామీ ఇచ్చారు. మరో విద్యార్థిని అన్నపూర్ణేశ్వరి ఎన్‌సీసీ, కంప్యూటర్ ల్యాబ్ కావాలని కోరగా, త్వరలోనే రాష్ట్రంలోకి ఏఐ ట్యూటర్‌ను తీసుకువస్తున్నామని, అలాగే ఏపీకి ప్రత్యేకంగా ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను కేంద్రం మంజూరు చేసిందని శుభవార్త తెలిపారు.

విద్యార్థుల భావోద్వేగ కథలు.. మంత్రి భరోసా
కార్యక్రమంలో పలువురు విద్యార్థులు తమ వ్యక్తిగత కష్టాలను, ఉన్నత లక్ష్యాలను పంచుకున్నారు. కదిరికి చెందిన షేక్ చాందిని, ఇంటర్‌లో 1000కి 991 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచానని, తన తండ్రి గుండె జబ్బుతో బాధపడుతున్నారని, ఆయన కోసమే కార్డియాలజిస్ట్ కావాలనుకుంటున్నానని తెలిపింది. నీట్ కోసం కోచింగ్ ఇప్పించాలని కోరగా, అందుకు పూర్తి సహాయం అందిస్తానని లోకేశ్ భరోసా ఇచ్చారు. 

టెక్కలికి చెందిన అనన్యశ్రీ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, భవిష్యత్తులో ఐఏఎస్ అధికారిణిగా విజన్ 2047 సాధనకు కృషి చేస్తానని చెప్పింది.

ఆత్మకూరుకు చెందిన షేక్ అనీషా, పాఠశాల స్థాయి నుంచే పోటీపరీక్షలకు శిక్షణ ఇవ్వాలని కోరగా, రాబోయే ఐదేళ్లలో 10, 11, 12 తరగతుల విద్యార్థులు చదువుతో పాటు కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమయ్యేలా ప్రణాళిక రచిస్తామని లోకేష్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా విద్యార్థి పవన్ సాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై శిక్షణ కోరగా.. రాబోయేది ఏఐ విప్లవమని, పాఠశాల స్థాయి నుంచే ఏఐ ల్యాబ్స్, ఫండమెంటల్స్‌పై శిక్షణ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

చదువు మధ్యలో ఆగకూడదు.. అండగా ఉంటా
అనంతపురం జిల్లా నార్పలకు చెందిన మనీష, తన తండ్రి చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారని కన్నీటిపర్యంతమవ్వగా, మంత్రి లోకేష్ చలించిపోయారు. "ధైర్యంగా ఉండు, నీ చదువుకు నేను సాయం చేస్తా" అని హామీ ఇచ్చారు. కుటుంబ పరిస్థితుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలో ఆపకూడదనేదే తన లక్ష్యమని, అలాంటి వారిని గుర్తించి చేయూతనిస్తామని చెప్పారు. 

ప్రకాశం జిల్లాకు చెందిన భాగ్యం అనే విద్యార్థిని, చిన్నతనంలోనే పెళ్లయినా ఆరేళ్ల తర్వాత మళ్లీ చదువు ప్రారంభించి ఒకేషనల్ కోర్సులో 990 మార్కులతో టాపర్‌గా నిలిచానని, ఇప్పుడు డిగ్రీ చదవాలని ఉందని చెప్పగా, ఆమెకు కూడా సాయం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తాను ఎప్పుడూ బట్టీ కొట్టలేదని, తన బలం అప్లికేషన్, ఎగ్జిక్యూషన్, క్రిటికల్ థింకింగ్ అని లోకేశ్ తన విద్యార్థి జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. 

శంఖవరం విద్యార్థిని స్వాతి తన గ్రామంలోని రోడ్డు దశాబ్దాలుగా అధ్వానంగా ఉందని చెప్పగా, మూడు నాలుగు నెలల్లో రోడ్డు వేయిస్తానని మాట ఇచ్చారు. విద్యార్థులకు శారీరక విద్యతో పాటు మానసిక ఆరోగ్య అవగాహన కూడా కల్పించాలని విశాఖ విద్యార్థి శ్రీహర్ష చేసిన సూచనను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం కేవలం సత్కారాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల ఆశలు, ఆకాంక్షలకు, ప్రభుత్వ విధాన రూపకల్పనకు వారధిగా నిలిచింది.
Nara Lokesh
Andhra Pradesh Education Minister
Shining Stars Program Tadepalli
AI Tutors in AP Schools
Amaravati World Class Library
AP Government Educational Reforms

More Telugu News