'సర్' జాబితాలో పేరు లేదని.. జైలుకు పంపుతారనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య
- హైదరాబాద్ బోరబండ ప్రాంతంలో విషాదం
- పాస్‌పోర్ట్ తో పాటు ఇతర ప్రభుత్వ ఐడెంటిటీ కార్డుల్లో తప్పుగా ఉన్న పేరు
- సర్ జాబితాలోని పేరుతో సరిపోని డాక్యుమెంట్లు
- భయంతో ఆత్మహత్య చేసుకున్న కారు డ్రైవర్ ముజిబుర్
హైదరాబాద్ లో ఒక అత్యంత హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ.. ఒక సామాన్యుడి ప్రాణం తీసింది. 'సర్' లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో, తనను జైలుకు పంపుతారనే భయంతో బోరబండ ఏరియాలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బోరబండ ప్రాంతంలోని భరత్‌నగర్ నివాసి అయిన షేక్ ముజిబుర్ రహ్మాన్ (51) ఒక సాధారణ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అందులో ఇద్దరు పిల్లలు మానసిక వికలాంగులు. అయితే ముజిబుర్ పేరు పాస్‌పోర్ట్ తో పాటు ఇతర ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులలో తప్పుగా పడటంతో... వాటిని సరిచేసుకోవడానికి ఏజెంట్ల చుట్టూ తిరుగుతూ ఇప్పటికే భారీగా ఖర్చు చేసి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు.
ఈ క్రమంలో ఎన్నికల సంఘం ప్రక్రియలో తన డాక్యుమెంట్లు సరిపోలడం లేదని, సర్ జాబితాలో తన పేరు లేదని ముజిబుర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. లిస్ట్‌లో పేరు లేకపోతే పోలీసులు వచ్చి తనను జైలుకు పంపుతారని... అదే జరిగితే తన ఇద్దరు దివ్యాంగ పిల్లలను, కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారంటూ భార్య వద్ద నిత్యం ఆవేదన చెందేవాడు. భార్య ఎంత ధైర్యం చెప్పినా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాల వల్ల అతడిలో భయం పోలేదు.
ఈ తీవ్ర మానసిక ఒత్తిడి భరించలేక ముజిబుర్ తన ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిజంగానే 'సర్' భయంతోనే చనిపోయాడా లేక ఇతర ఆర్థిక, ఆరోగ్య కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.