సోషల్ మీడియా వాడకం పెరిగాక పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. నేరాలు, ఘోరాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చే పోలీస్ స్టేషన్లలో కొన్నిసార్లు వింత ఫిర్యాదులు సైతం నమోదవుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇలాంటి విచిత్రమైన ఘటనే చోటుచేసుకుంది. తనను వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని, మళ్లీ అందులో చేర్పించాలంటూ ఓ మహిళ ఏకంగా పోలీసులనే ఆశ్రయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అస‌లేం జ‌రిగిందంటే..!
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 పరిధిలోని ఎన్‌బీటీ నగర్ నివాసితుల కోసం స్థానికంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. కాలనీలోని పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలపై చర్చించుకోవడానికి, పరిష్కార మార్గాలు కనుగొనడానికి ఈ గ్రూప్‌ను వేదికగా చేసుకున్నారు. అయితే, కొద్దికాలంగా కొందరు సభ్యులు గ్రూప్ అసలు ఉద్దేశాన్ని పక్కనపెట్టి రాజకీయ పార్టీలకు సంబంధించిన సందేశాలు, వీడియోలు, ఫొటోలు విపరీతంగా పోస్ట్ చేయడం ప్రారంభించారు.

దీంతో గ్రూప్ అడ్మిన్ జోక్యం చేసుకుని, ఇది రాజకీయ ప్రచార వేదిక కాదని, కేవలం బస్తీ సమస్యల కోసమేనని సభ్యులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గ్రూప్‌లో ఎలాంటి రాజకీయ పోస్టులు పెట్టవద్దని నియమాలను గుర్తుచేశారు. అయినప్పటికీ ఓ మహిళా సభ్యురాలు ఈ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా రాజకీయ సందేశాలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అడ్మిన్ పలుమార్లు వారించినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. దీంతో విసిగిపోయిన అడ్మిన్, గ్రూప్ నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెను ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు.

దీనిని అవమానంగా తీసుకున్న సదరు మహిళ, తనను తిరిగి గ్రూప్‌లో చేర్చుకోవాలని అడ్మిన్‌ను పలుమార్లు కోరారు. అయితే, గ్రూప్ నిబంధనలు పాటించని వారిని చేర్చుకోలేమని అడ్మిన్ నిరాకరించారు. దీంతో ఆమె ఆగ్రహం చెంది, అడ్మిన్ తనను ఉద్దేశపూర్వకంగా గ్రూప్ నుంచి తీసేసి మానసికంగా వేధిస్తున్నాడంటూ నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ, త‌ప్ప‌ని పరిస్థితుల్లో గ్రూప్ అడ్మిన్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, అడ్మిన్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. గ్రూప్ నియమాలను పదేపదే ఉల్లంఘించినందువల్లే ఆమెను తొలగించానని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి గ్రూప్‌లో చేర్చుకునే ప్రసక్తే లేదని పోలీసుల ఎదుటే తేల్చి చెప్పారు. దీంతో ఈ వింత కేసును ఎలా పరిష్కరించాలో తెలియక బంజారాహిల్స్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణంగా నేరపూరిత ఫిర్యాదులు స్వీకరించే తాము, ఈ వాట్సాప్ గొడవను ఎలా పరిష్కరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.