ఇరాన్‌తో ట్రంప్‌ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు?

Donald Trump Iran deal 5 key world changing promises
  • హర్మూజ్‌ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్‌ అంగీకారం?
  • ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం
  • కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ప్రతిపాదన
  • అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని ఇరాన్‌ హామీ!
  • ఇరాన్‌ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ
అమెరికా-ఇరాన్‌ మధ్య నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధ హెచ్చరికలు, చమురు సరఫరాపై ఆందోళనలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో ఓ చారిత్రక ఒప్పందం దిశగా చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే దీనికి తుది రూపు దక్కవచ్చని వెల్లడించారు. ఈ నేపథ్యంలో బ్లూమ్‌బర్గ్‌, ఆక్సియోస్‌ కథనాల ప్రకారం ప్రతిపాదిత అవగాహన ఒప్పందంలో ఐదు కీలక అంశాలు ఉన్నాయి.

1. హర్మూజ్‌ ఓపెన్‌
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా ఉన్న హర్మూజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ఒప్పందం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోపు వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా రాకపోకలు సాగేందుకు అనుమతించనుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఇది భారీ ఊరటనివ్వొచ్చు.

2. ఇరాన్‌పై ఆంక్షల సడలింపు
ఇరాన్‌పై విధించిన కొన్ని ఆంక్షలను అమెరికా ఎత్తివేయనుంది. ముఖ్యంగా చమురు ఎగుమతులపై ఉన్న పరిమితులు సడలే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊతం లభించే అవకాశముంది.

3. మరో 60 రోజుల కాల్పుల విరమణ
ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు ఇరు దేశాలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ వ్యవధిలో విస్తృత స్థాయి చర్చలు కొనసాగి శాశ్వత పరిష్కారానికి మార్గం సుగమం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

4. అణ్వాయుధాలపై ఇరాన్‌ హామీ
అణ్వాయుధాల అభివృద్ధి దిశగా వెళ్లబోమని ఇరాన్‌ హామీ ఇవ్వనుంది. అలాగే యురేనియం నిల్వలు, అణు కార్యక్రమ భవిష్యత్తుపై చర్చలకు అంగీకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే అణు ఒప్పందానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఇంకా ప్రత్యేక చర్చలు జరగాల్సి ఉంది.

5. అమెరికా బలగాల ఉపసంహరణ
ఇరాన్‌ చాలా కాలంగా కోరుతున్న అంశాల్లో ఒకటైన అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ కూడా ప్రతిపాదిత ఒప్పందంలో చోటు దక్కినట్లు సమాచారం. ఇరాన్‌ చుట్టుపక్క ప్రాంతాల నుంచి అమెరికా సైనిక వనరులను తగ్గించేందుకు వాషింగ్టన్‌ సిద్ధపడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి.

ప్రపంచంపై ప్రభావం?
ఈ ఒప్పందం కార్యరూపం దాల్చితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు ప్రపంచ చమురు మార్కెట్లలో స్థిరత్వం నెలకొనే అవకాశం ఉంది. హర్మూజ్‌ జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకోవడం, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు వంటి అంశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Go Back to Shorts
Donald Trump
Iran Deal
Strait of Hormuz
US Iran Relations
Global Oil Market
Nuclear Program Assurances

More Telugu News