ఆటతో కోట్లాది మంది అభిమానులను సంపాదించడమే కాదు.. తమ సంపాదనతో ముంబై వంటి మహానగరంలో అత్యంత ఖరీదైన ఆస్తులనూ కూడబెడుతున్నారు భారత క్రికెట్ స్టార్లు. వారి విజయాలకు, విలాసవంతమైన జీవనశైలికి ప్రతీకగా నిలుస్తున్న ఈ గృహాలు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో కొలువై ఉన్నాయి.

ముంబైలోని వర్లి ప్రాంతం ఆధునిక లగ్జరీకి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఇక్కడి 'అహుజా టవర్స్‌'లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నివాసం ఉంటున్నారు. 29వ అంతస్తులో ఉన్న ఈ 4BHK ఫ్లాట్ నుంచి అరేబియా సముద్రం 270 డిగ్రీల కోణంలో కనువిందు చేస్తుంది. దీని విలువ సుమారు రూ. 30 కోట్ల నుంచి 40 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఇదే వర్లిలోని మరో ప్రతిష్ఠాత్మక 'ఓంకార్ 1973' టవర్‌ అయితే ఇద్దరు స్టార్ క్రికెటర్లకు నిలయంగా మారింది. ఇందులో విరాట్ కోహ్లీ రూ. 34 కోట్లతో 7,000 చదరపు అడుగుల భారీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయగా, మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఏకంగా రూ. 64 కోట్లతో 16,000 చదరపు అడుగుల డ్యూప్లెక్స్ ఫ్లాట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఒకవైపు వర్లి ఆకాశహర్మ్యాలతో పోటీ పడుతుంటే, మరోవైపు బాంద్రా ఎప్పటినుంచో సెలబ్రిటీలకు అడ్డాగా ఉంది. ఇక్కడి పెర్రీ రోడ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 2007లో కొనుగోలు చేసిన ఈ చారిత్రక బంగ్లాను, ఆయన తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకున్నాడు. 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 100 కోట్లకు పైమాటే. ఇదే బాంద్రాలోని పాలి హిల్‌లో కేఎల్ రాహుల్ రూ. 20 కోట్ల విలువైన ఫ్లాట్‌లోనూ, బాంద్రా వెస్ట్‌లోని 'జ్యూయల్ టవర్'లో వినోద్ కాంబ్లీ రూ. 8 కోట్ల అపార్ట్‌మెంట్‌లోనూ నివసిస్తున్నారు.

మొత్తం మీద, ఈ క్రికెటర్ల ఇళ్లు కేవలం నివాస స్థలాలు మాత్రమే కాదు. వారి అద్భుత విజయాలకు, సంపదకు, పెట్టుబడి నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తూ ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి.