ఇన్‌స్టాలో సూసైడ్‌ పోస్ట్‌.. 8 నిమిషాల్లో స్పాట్‌కు చేరిన పోలీసులు.. ఎలా సాధ్యమైంది?

Uttar Pradesh Police save youth after Instagram suicide post alert
  • మెటాలో ఏఐ ఆధారిత సూసైడ్‌ అలర్ట్‌ ఫీచర్‌
  • రీల్‌ పోస్ట్‌ చేసిన వెంటనే యూపీ పోలీసులకు సమాచారం
  • 2022లో మెటాతో యూపీ ప్రభుత్వం ఒప్పందం
  • ఇప్పటి వరకు దక్కిన 3,011 మంది ప్రాణాలు
సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ పంపిన ఓ అత్యవసర అలర్ట్, ఉత్తరప్రదేశ్ పోలీసుల మెరుపు వేగం కలిసి ఓ 25 ఏళ్ల యువకుడి ప్రాణాన్ని కాపాడాయి. ఇన్‌స్టాలో ఆత్మహత్యకు సంబంధించిన పోస్ట్ పెట్టిన కేవలం ఎనిమిది నిమిషాల్లోనే మీరట్‌ పోలీసులు అతని వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను నిలిపారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మెటా సంస్థల మధ్య ఉన్న ప్రత్యేక ఒప్పందం వల్ల ఇది సాధ్యమైంది.

యూపీలోని మీరట్ జిల్లా సర్ధానా ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమవడంతో తీవ్ర మానసిక ఒత్తిడి, కుంగుబాటుకు లోనయ్యాడు. ఈ క్రమంలో జూన్ 7న అతను ఓ తెల్లటి ద్రవాన్ని తాగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశాడు. దానికి ‘‘ఇక నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండు’’ అనే క్యాప్షన్‌ను జోడించాడు. ఎవరైనా తమకు తాము హాని చేసుకునేలా పోస్ట్‌లు పెడితే గుర్తించే మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ వెంటనే అలర్ట్ అయ్యింది.

జూన్ 7 సాయంత్రం 6.53 గంటలకు మెటా సంస్థ ఈ ఆత్మహత్య హెచ్చరికను నేరుగా ఉత్తరప్రదేశ్ పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సోషల్ మీడియా సెంటర్‌కు పంపింది. డీజీపీ ఆదేశాల మేరకు, ఆ సెంటర్ అధికారులు లొకేషన్, మొబైల్ నంబర్ ఆధారంగా మీరట్ పోలీసులను అప్రమత్తం చేశారు. సర్ధానా పోలీసులు సమాచారం అందిన కేవలం 8 నిమిషాల్లోనే ఆ యువకుడి ఇంటికి చేరుకున్నారు.

పోలీసులు వెళ్లేసరికి ఆ యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అతని పక్కనే ఒక అనుమానాస్పద ద్రవం ఉన్న బాటిల్ కూడా లభ్యమైంది. పోలీసులు ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యుల సహాయంతో ఆ యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో వైద్యం అందడంతో ఆ యువకుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని కోలుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు ఆ యువకుడికి, అతని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ధైర్యం చెప్పారు.

యూపీ పోలీసులకు, మెటా సంస్థకు మధ్య 2022 నుంచి ఈ ఒప్పందం అమల్లో ఉంది. ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలను పంచుకుంటే ఆ సమాచారాన్ని మెటా వెంటనే పోలీసులకు పంపుతుంది. ఈ విధానం ఎంత అద్భుతంగా పనిచేస్తోందంటే.. 2023 జనవరి 1 నుంచి 2026 మే 31 వరకు ఈ రకమైన సోషల్ మీడియా అలర్ట్‌ల ద్వారా ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఏకంగా 3,011 మంది ప్రాణాలను పోలీసులు కాపాడగలిగారు.
Go Back to Shorts
Uttar Pradesh Police
Meta
Instagram suicide alert
Meerut police rescue
Social media monitoring
UP Police Meta partnership

More Telugu News