డీఎస్సీ అక్రమాలు నిరూపిస్తే రాజీనామా: ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి
- మెగా డీఎస్సీ క్రీడా కోటాపై వైసీపీ ఆరోపణలను ఖండించిన టీడీపీ
- అక్రమాలు జరిగితే 39 పోస్టులు ఎందుకు ఖాళీగా ఉన్నాయని ప్రశ్న
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రకారమే నియామకాలు జరిగాయన్న టీడీపీ నేతలు
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే కూన రవికుమార్‌లపై వైఎస్సార్‌సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. అర్హులైన అభ్యర్థుల ఎంపికపై అనుమానాలు వ్యక్తం చేయడం క్రీడాకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. అన్ని ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నియామక ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని వారు స్పష్టం చేశారు.
ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియపై వైఎస్సార్‌సీపీ నేతలకు కనీస అవగాహన లేదని ఎమ్మెల్సీ శ్రీకాంత్ విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని రద్దు చేస్తామంటూ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలకు బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, ఈ అంశంపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.