ఒకేలా తిన్నా ఒకరు లావు.. మరొకరు సన్నగా ఎందుకుంటారు?
- తెలియని కదలికలతో క్యాలరీల ఖర్చు
- ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లదే ప్రధాన పాత్ర
- జీవక్రియ రేటు నెమ్మదిస్తే లావయ్యే అవకాశం
- నిద్రలేమి వల్ల హార్మోన్ల అస్తవ్యస్తం
- ఇవన్నీ లావు పెరగడాన్ని ప్రభావితం చేస్తాయి
కదలికల ప్రభావం
మనం వ్యాయామం చేయనప్పుడు శరీరం ఖర్చు చేసే శక్తిని ‘నీట్’ (NEAT - Non-Exercise Activity Thermogenesis) అని పిలుస్తారు. రోజంతా నిలబడటం, ఇల్లు లేదా ఆఫీసులో నడవడం, కూర్చునే భంగిమలు మార్చడం, మెట్లు ఎక్కడం, చేతులు, కాళ్లు ఆడించడం వంటివి ఇందులోకే వస్తాయి. కొందరు వ్యక్తులు తెలీకుండానే రోజంతా ఇలాంటి కదలికలు ఎక్కువగా చేస్తూ ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తారు. వ్యాయామం చేసినా.. మిగతా రోజంతా కదలకుండా కూర్చునేవారిలో ఈ క్యాలరీలు కొవ్వుగా మారిపోతాయి.
హార్మోన్ల లూటీ ఆట
మన శరీర బరువును, ఆకలిని నియంత్రించడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని అణచివేసే ‘లెప్టిన్’, ఆకలిని పెంచే ‘గ్రెలిన్’, గ్లూకోజ్ జీవక్రియను చూసే ‘ఇన్సులిన్’, ఆకలిని కంట్రోల్ చేసే ‘జీఎల్పీ-1’ వంటి హార్మోన్ల సంకేతాలను మెదడు నిరంతరం గమనిస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు ఉన్నవారికి భోజనం చేసినా త్వరగా ఆకలి వేయడం, తరచూ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది.
జీవక్రియ రేటులో తేడాలు
మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు శరీరం ఖర్చు చేసే క్యాలరీలను ‘రెస్టింగ్ మెటబాలిక్ రేట్’ అంటారు. ఇది కండరాల పరిమాణం, వయసు, లింగం, థైరాయిడ్ పనితీరు, జన్యువులపై ఆధారపడి ఉంటుంది. శరీరంలో లీన్ కండరాలు ఎక్కువగా ఉన్నవారు విశ్రాంతి సమయంలోనూ ఎక్కువ క్యాలరీలు బర్న్ చేయగలరు. అదే మెటబాలిజం స్లోగా ఉన్నవారు తక్కువ తిన్నా లావవుతారు.
జన్యువులు, నిద్రలేమి
జీవక్రియలతో పాటు జన్యువులు కూడా ఒక వ్యక్తి లావు అవడాన్ని ప్రభావితం చేస్తాయి. మన శరీరం ఎంత సమర్థంగా కొవ్వును నిల్వ చేస్తుందనేది జన్యువుల వల్ల మారుతుంది. అలాగే నిద్రలేమి కూడా బరువు పెరగడానికి ప్రధాన కారణం. తక్కువగా నిద్రపోయే వారిలో ఆకలి హార్మోన్లు అస్తవ్యస్తమై, ఎక్కువ క్యాలరీలు ఉన్న జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి బరువును పెంచుతుంది.