Advertisement

తమిళనాడులో కొత్త పార్టీ.. ఆసక్తికర విషయాలు ప్రకటించిన అన్నామలై!

Annamalai says his party will fight next polls
  • బీజేపీతో 18 నెలలుగా విభేదాలున్నాయన్న అన్నామలై
  • డిసెంబర్‌లోనే రాజీనామా చేయాలనుకున్నట్లు వెల్లడి
  • ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని పార్టీ సూచించినట్లు చెప్పిన నేత
  • రజినీకాంత్‌ పార్టీ పెట్టకపోవడం వల్లే బీజేపీలో చేరినట్లు వెల్లడి
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటన
తమిళనాడులో మరో కొత్త పార్టీ రానుంది. బీజేపీకి రాజీనామా చేసిన అన్నామలై ఈ మేరకు శుక్రవారం ప్రకటన చేశారు. బీజేపీతో 18 నెలలుగా విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. వాటిని పరిష్కరించుకునేందుకు పార్టీ అధిష్ఠానంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపినట్లు చెప్పారు. కానీ, అది సాధ్యం కాకపోవడంతో పార్టీకి భారంగా ఉండాలనుకోవడం లేదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అందుకే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. 

ఇక నుంచి తాను కొత్త రాజకీయ ఉద్యమం ప్రారంభించనున్నట్లు అన్నామలై ప్రకటించారు. ఈ ప్రయాణంలో తాను ఒంటరిగానే పోరాడనున్నట్లు పేర్కొన్నారు. రజినీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని ఎదురుచూశానని.. ఆయన నేతృత్వంలో ముందుకెళ్లాలన్నది తన కోరిక అని వెల్లడించారు. తనని రాజకీయాల్లోకి రావాలని పిలిచింది కూడా రజినీకాంతే అని పేర్కొన్నారు. కానీ, ఆయన పార్టీ పెట్టకపోవడంతోనే బీజేపీలో చేరినట్లు చెప్పారు.

బీజేపీ భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఎంతో శ్రమించానని అన్నామలై పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని ఆశించినట్లు చెప్పారు. కానీ, అది జరగలేదని తెలిపారు. పార్టీ అగ్రనాయత్వంతో తన రాజీనామా అంశాన్ని డిసెంబర్‌లోనే చెప్పినట్లు వెల్లడించారు. కానీ, ఎన్నికలు ముగిసే వరకు ఆగాలని వారు కోరినట్లు తెలిపారు. బీజేపీ సీనియర్‌ నేత బీఎల్‌. సంతోష్ హామీ మేరకే తాను పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని తీసుకురావడమే తన లక్ష్యమని అన్నామలై ప్రకటించారు. సామాన్యుడి కేంద్రంగా సాగే రాజకీయాలను నిర్మించాలనుకున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
Advertisement
Annamalai
BJP
tAMILNADU

More Telugu News