లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. సుస్మితా సేన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్!
- సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' అనడంపై స్పందించిన మోదీ
- తానే ఆమెపై ఆధారపడ్డానని వ్యాఖ్య
- మోదీ ఇంటర్వ్యూ వైరల్ అయిన తర్వాత సుస్మితా సేన్ తొలిసారి పోస్ట్
- స్నేహితుడు పంపిన బహుమతి గురించి పంచుకున్న సుస్మిత
- లలిత్ మోదీ ఇష్యూపై మాత్రం మౌనం
ఇటీవల 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. "సుస్మిత చాలా అందమైన, బాగా సంపాదించుకున్న మహిళ. ఈ గ్రహం మీద నేను చూసిన ఎవరికన్నా ఆమె దగ్గరే ఎక్కువ వజ్రాలున్నాయి. అవన్నీ ఆమె స్వయంగా సంపాదించుకున్నవే. ఒకానొక సమయంలో నేను ఆమెతో బయటకు వెళ్లినప్పుడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రాలేదు. అన్నీ ఆమెనే చూసుకునేది. నేను ఆమెపై ఆధారపడిన ప్రియుడిలా ఉండేవాడిని. ఆమె అద్భుతమైన మహిళ" అని వివరించారు.
అంతేకాకుండా "ప్రజలు ఆమెను గోల్డ్ డిగ్గర్ అన్నప్పుడు చాలా బాధేసింది. అది పూర్తిగా తప్పు. నిజానికి సుస్మిత గోల్డ్ డిగ్గర్ కాదు, లలిత్ ఒక డైమండ్ డిగ్గర్ (వజ్రాల వేటగాడు). ఆ వజ్రం సుస్మితా సేన్" అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఇంటర్వ్యూ వైరల్ అయిన నేపథ్యంలో సుస్మితా సేన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆమె ఈ వివాదంపై నేరుగా స్పందించలేదు. తన స్నేహితుడు బహుమతిగా పంపిన ఎర్రటి అందమైన చెప్పులను చూపిస్తూ.. "ఎక్కువమంది ప్రయాణించని దారుల్లో నేను నడుస్తాను.. అదీ సౌకర్యవంతమైన, సెక్సీ చెప్పులతో! ఒక మనిషి తన మాట నిలబెట్టుకుంటే నాకు చాలా ఇష్టం. నా స్నేహితుడికి ధన్యవాదాలు" అంటూ రాసుకొచ్చారు.
గతంలో 2022లో తమ బంధం బయటపడినప్పుడు, సుస్మితను 'గోల్డ్ డిగ్గర్' అంటూ ట్రోల్స్ చేశారు. అప్పుడు కూడా ఆమె ఘాటుగా స్పందిస్తూ.. "నేను బంగారం కంటే లోతుగా తవ్వుతాను. నాకు ఎప్పుడూ వజ్రాలే ఇష్టం. వాటిని ఇప్పటికీ నేనే కొనుక్కుంటాను" అని బదులిచ్చారు. ఆ తర్వాత 2023లో ఒక ఇంటర్వ్యూలో లలిత్ మోదీతో బంధాన్ని తన జీవితంలో 'మరో దశ'గా అభివర్ణించారు. తాజాగా లలిత్ మోదీ వ్యాఖ్యలతో ఈ పాత బంధం మరోసారి వార్తల్లో నిలవగా, సుస్మిత మాత్రం తన పోస్ట్‌తో తాను ఈ వివాదాలకు అతీతంగా ఉన్నానని పరోక్షంగా సూచించినట్లు కనిపిస్తోంది.