హరిద్వార్‌ ఆలయంలో దారుణం.. ఇద్దరు సాధువుల హత్య.. మృతదేహాలు పూడ్చిపెట్టిన నిందితులు

Haridwar temple atrocity two sadhus murdered and bodies buried by suspects
  • పథ్రేశ్వర్ ఆలయ సమీపంలో సాధువుల హత్య 
  • అడవిలో గుంత తీసి మృతదేహాలు పూడ్చిపెట్టిన వైనం
  • మద్యం మత్తులో గొడవే హత్యకు కారణం 
  • ప్రధాన పూజారి, ఇతరుల కోసం పోలీసుల గాలింపు  
 ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం హరిద్వార్‌లో ఘోర దారుణం వెలుగుచూసింది. పాత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసిద్ధ పథ్రేశ్వర్ మహాదేవ్ ఆలయం వద్ద నివసించే ఇద్దరు సాధువుల మృతదేహాలు సమీపంలోని అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఆలయానికి అనుబంధంగా ఉండే ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించి, అక్కడ నివసించే ఇద్దరు సాధువులు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి సమీపంలో కొందరు వ్యక్తులు గుంత తవ్వుతుండటాన్ని తాను గమనించానని, అంతకుముందు రాత్రి ఆలయంలో కొందరు మద్యం తాగి తీవ్రంగా గొడవ పడ్డారని ఆయన పోలీసులకు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాజాగా తవ్విన గుంతల నుంచి మృతదేహాలను వెలికితీశారు. హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) నవనీత్ సింగ్ భుల్లార్ నేతృత్వంలో ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం దేహాలను ఆసుపత్రికి తరలించింది. 

ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు నిందితులను గుర్తించినట్లు ప్రకటించారు. ఈ జంట హత్యల వెనుక ఆలయ ప్రధాన పూజారితో పాటు మరికొందరి హస్తం ఉందనే అనుమానంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
Advertisement
Haridwar
Uttarakhand
Sadhus Murder
Pathreshwar Mahadev Temple
Navneet Singh Bhullar
Haridwar Police

More Telugu News