గంజాయి అమ్మకాలను ప్రశ్నించినందుకు ఘోరం.. చెన్నైలో యువకుడిని కొట్టి చంపిన వైనం
- గంజాయి విక్రయాలను ప్రశ్నించిన విష్ణు
- గ్యాంగ్ దాడిలో యువకుడి మృతి
- తమిళనాడు ప్రభుత్వంపై ఈపీఎస్ తీవ్ర విమర్శలు
- శాంతిభద్రతల పరిరక్షణలో వైఫల్యంపై ఆరోపణలు
- రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఈ హత్య తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్) ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. "ఈ ప్రభుత్వంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని ప్రశ్నిస్తే హత్యే సమాధానమా? వీరు చెబుతున్న మార్పు ఇదేనా?" అని ప్రశ్నించారు. మంగళవారం తిరుచిరాపల్లిలో ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ.. తనపై నిరాధారమైన ఆరోపణలు వస్తున్నాయని వ్యక్తంచేసిన అసహనాన్ని ఈ సందర్భంగా పళనిస్వామి ప్రస్తావించారు. కేవలం అధికారులను నియమిస్తేనే సరిపోతుందా అని, ప్రతి ప్రభుత్వంలోనూ పనిచేసేది ఈ అధికారులేనని, మార్పు అనేది పాలకుల నుంచి రావాలని ఆయన హితవు పలికారు.
పోలీస్ శాఖను తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి, శాంతిభద్రతల బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం సిగ్గుచేటని, డ్రగ్స్ మహమ్మారిని తాను నిర్మూలించలేకపోతున్నానని ముఖ్యమంత్రి పరోక్షంగా అంగీకరించినట్లేనని పళనిస్వామి ఆరోపించారు. 'పరిపాలన ఎలా చేయాలి' అనే ఆరు నెలల క్రాష్ కోర్సును మీరు పూర్తి చేసే వరకు ప్రజలు ఇలాగే ప్రాణాలు కోల్పోతూ బాధపడాలా? కనీసం ఎవరూ ప్రశ్నించడానికి కూడా వీల్లేదా? అంటూ తీవ్రస్థాయిలో నిలదీశారు.