గద్దర్‌కు బండి కొనిచ్చా.. బతికున్నప్పుడు మీరేం చేశారు?: పవన్ కల్యాణ్ భావోద్వేగం

Pawan Kalyan says he had bought a vehicle for Gaddar
  • గద్దర్ గురించి భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్
  • బండి కొనివ్వమని అడిగితే వెంటనే ఇచ్చానన్న జనసేనాని
  • బతికున్నప్పుడు గద్దర్‌ను పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శ
  • తెలంగాణ ఏర్పాటుకు కాదని, విభజన తీరుకే వ్యతిరేకమని స్పష్టీకరణ
  • తెలంగాణలో జనసేన కచ్చితంగా ఉంటుందని, పోటీ చేస్తుందని వెల్లడి
ప్రజా గాయకుడు, దివంగత గద్దర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గద్దర్ బతికున్నప్పుడు ఆయన్ను పట్టించుకోని వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను విమర్శించే వారు గద్దర్ గురించి మాట్లాడటంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

"వామపక్షవాదులం అని చెప్పుకొనే కొందరు విశ్లేషకులు మాట్లాడే తీరు ఆశ్చర్యంగా ఉంటుంది. "ప్రపంచ కార్మికులారా ఏకం కండి" అని నినదించిన వామపక్ష భావజాలం, ఈరోజు ప్రాంతీయతకు పరిమితమైపోయింది. కమ్యూనిజం ఇలాంటి వాటి వల్లే చచ్చిపోతుంది. ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ నా సూటి ప్రశ్న ఒక్కటే. "గద్దరన్న బతికి ఉన్నప్పుడు మీరందరూ ఎక్కడ ఉన్నారు? ఆయనకు మీరేం చేశారు?"

గద్దరన్న వెన్నులో బుల్లెట్లు దిగినప్పుడు, నడవడానికి ఇబ్బంది పడుతూ నా దగ్గరికి వచ్చారు. మా జర్నలిస్ట్ కాలనీలోని జనసేన ఆఫీస్‌కు వచ్చి నన్ను కలిశారు. నన్ను స్వేచ్ఛగా "ఒరేయ్ తమ్మీ" అని పిలిచేంత చనువు మా మధ్య ఉంది. "ఒరేయ్ తమ్మీ, వెన్నులో బుల్లెట్ల వల్ల నడవలేకపోతున్నా. ఆటోలో తిరగలేకపోతున్నా. ఒక బండి కొనివ్వరా" అని హక్కుగా అడిగారు. నేను 24 గంటల్లోనే ఆయనకు కారు కొనిచ్చాను. ఈ విషయం నేను ఎప్పుడూ చెప్పలేదు. బతికున్నప్పుడు ఆయనకు ఏం చేశారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనకు కనీసం పర్మిషన్లు కూడా ఇవ్వని మీరు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారు.

నేను రాజకీయాల్లోకి వచ్చాకే గద్దరన్న పరిచయం అనుకుంటున్నారు. అది నిజం కాదు. నేను ‘ఖుషి’ సినిమా చేశాక, అన్నయ్య చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, "ఒరేయ్, గద్దర్ గారు నీతో మాట్లాడాలంటున్నారు" అని చెప్పారు. గద్దరన్న నాతో, "ఒరేయ్, నువ్వు సినిమాలో మా పోరాటాలు చూపించావు. తరిమెల నాగిరెడ్డి గారి ‘తాకట్లో భారతదేశం’ భావాన్ని విజువల్స్‌లో పెట్టావంట. మా భావాలు అర్థం చేసుకున్నవాడివి" అన్నారు. దానికి నేను, "అన్నా, నాకు లెఫ్ట్ వింగో, రైట్ వింగో తెలియదు. నాది హ్యూమనిజం" అని చెప్పాను.

ఆ రోజు నుంచి ఆయన చనిపోయేదాకా మా బంధం కొనసాగింది. ఆయన ఆసుపత్రిలో చివరి గడియల్లో ఉన్నప్పుడు కూడా వెళ్లి కలిశాను. "అన్నా మీకు ఏం కావాలి?" అని అడిగితే, "ఏం వద్దురా తమ్మీ, తెలంగాణ, ఆంధ్ర యువతకు, దేశ యువతకు భవిష్యత్తు వాళ్లదే అని చెప్పు" అన్నారు. ఆయన నాకు ఓ లెటర్ కూడా రాసిచ్చారు. కానీ దాన్ని నేను ఇప్పటికీ బయటపెట్టలేదు. అంతటి ఆత్మీయ బంధం మాది" అని పవన్ వివరించారు.

ఈ సందర్భంగా తెలంగాణపై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటు చేస్తే తాను 11 రోజులు అన్నం తినలేదని అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నడూ వ్యతిరేకం కాదని, పార్లమెంట్ తలుపులు మూసి అప్రజాస్వామికంగా రాష్ట్రాలను విభజించిన తీరును మాత్రమే వ్యతిరేకించానని తెలిపారు. కొందరు నాయకులు కావాలనే తనపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తన గుండెల్లో తెలంగాణ ఉందని, ఇక్కడి ప్రజలంటే తనకు ఎంతో ప్రేమ అని అన్నారు. 
Go Back to Shorts
Pawan Kalyan
Gaddar
Vehicle
Janasena
Hyderabad
Telangana

More Telugu News