ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Bhogapuram Airport inauguration on August 1 CM Chandrababu issues key orders
  • ఆగస్ట్ 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించినున్న ప్రధాని మోదీ
  • సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
  • విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు
  • ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి అవుతుందన్న సీఎం చంద్రబాబు
  • ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేసిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఉత్తరాంధ్ర ప్రగతిలో ఈ విమానాశ్రయం ఒక కీలక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో రాష్ట్ర విమానయాన రంగంలో ఒక నూతన శకం మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం కేవలం ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంచుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఇది భారీ ఊతాన్ని ఇస్తుందని వివరించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేయనున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు ఉండాలని సీఎం సూచించారు. గిరిజన సంప్రదాయ నృత్యమైన థింసాతో పాటు, కూచిపూడి నృత్య ప్రదర్శనలతో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. 13 వేల మందితో నిర్వహించే థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. 11 అంతర్జాతీయ, 25 జాతీయ చానళ్లలో ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా అరకు కాఫీతో సహా స్థానిక ఉత్పత్తులు, పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం కల్పించి, బ్రాండింగ్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు.
Advertisement
Bhogapuram International Airport
Chandrababu Naidu
Narendra Modi
Andhra Pradesh News
Alluri Sitaramaraju Airport
Dhimsa Dance Record

More Telugu News