సౌదీలో మరణశిక్ష.. రూ.34 కోట్ల క్షమాధనం చెల్లించి భారత్ తిరిగొచ్చిన కేరళ వ్యక్తి

Abdul Rahim Returns to Kerala After Paying Fine in Saudi Arabia
  • 2006లో సౌదీ వెళ్లి దివ్యాంగ బాలుడికి కేర్ టేకర్‌గా చేరిన అబ్దుల్ రహీమ్
  • ప్రమాదవశాత్తు బాలుడు మృతి చెందడంతో మరణశిక్ష
  • విరాళాల రూపంలో డబ్బులు ఇచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు
ఇరవై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియా వెళ్లిన కేరళకు చెందిన వ్యక్తి అనుకోని చిక్కుల్లో పడ్డాడు. బాలుడి మరణానికి కారణమయ్యాడంటూ అక్కడి న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష విధించింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఆయనకు సహాయం చేయడంతో సుమారు రూ.34 కోట్ల మొత్తాన్ని క్షమాధనంగా చెల్లించి, కేరళకు చేరుకున్నాడు. సొంత దేశానికి చేరుకున్న అతను తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను చూడగానే భావోద్వేగానికి లోనయ్యాడు.

కేరళలోని కోజీకోడ్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఒక దివ్యాంగ బాలుడికి కేర్‌టేకర్‌గా చేరాడు. ప్రమాదవశాత్తూ ఆ బాలుడు మృతి చెందడంతో రహీమ్‌పై సౌదీ అధికారులు కేసు నమోదు చేశారు. రహీమ్‌కు క్షమాభిక్ష పెట్టడానికి బాలుడి కుటుంబం నిరాకరించింది. దీంతో 2018లో కోర్టు అతనికి మరణశిక్షను విధించింది. అబ్దుల్ రహీమ్ ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ దేశ చట్టాల ప్రకారం భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

రహీమ్‌ను ఉరిశిక్ష నుంచి కాపాడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీలు ఏకమయ్యారు. విరాళాల రూపంలో 15 మిలియన్ల సౌదీ రియాల్స్ సౌదీ కోర్టుకు చెల్లించారు. ఈ మొత్తం మన కరెన్సీలో సుమారు రూ.34 కోట్లు. క్షమాధనం చెల్లించడంతో సౌదీ కోర్టు అతనిని విడుదల చేసింది. అబ్దుల్ రహీమ్ బుధవారం రాత్రి సౌదీ నుంచి కేరళ చేరుకున్నాడు. గురువారం ఉదయం కరిపూర్ విమానాశ్రయంలో దిగి తన స్వగ్రామానికి వెళ్లాడు.

ఈ సందర్భంగా అబ్దుల్ రహీమ్ మాట్లాడుతూ, తన విడుదల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నాడు. తన తల్లిని మళ్లీ కలుసుకున్నానంటే ఇందుకు తనకు సహకరించిన వారే కారణమని అన్నాడు. ఆయన రాకతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ సంతోషం రెట్టింపయిందని రహీమ్ బంధువులు, స్నేహితులు పేర్కొన్నారు. ఇంటికి చేరుకున్న ఆయన గుమ్మం వద్ద ఎదురుచూస్తున్న తన తల్లిని గుండెలకు హత్తుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది.
Go Back to Shorts
Abdul Rahiman
Saudi Arabia
Kerala
Malayali
Death Sentence
Repatriation
Kozhikode
Compassion
Saudi Court

More Telugu News