సమాజంలో మగపిల్లల కోసం ఉన్న ఆశ ఓ యువతి ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం 22 ఏళ్ల వయసులోనే ఓ యువతి ఆరోసారి గర్భం దాల్చిన ఘటన రాజస్థాన్‌లో వెలుగుచూసింది. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే, రాజస్థాన్‌కు చెందిన 22 ఏళ్ల యువతికి ఇప్పటికే నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె పెద్ద కుమార్తె వయసు 8 సంవత్సరాలు. అయినా, మరింత మంది కొడుకులు కావాలనే కుటుంబ ఒత్తిడితో ఆమె మరోసారి గర్భం దాల్చాల్సి వచ్చింది. ప్రస్తుతం ఐదు నెలల గర్భిణిగా ఉన్న ఆమె, ఇటీవల నీరసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఉత్తరప్రదేశ్‌లోని బరౌత్‌లో ఉన్న స్పందన్ ఆసుపత్రికి వెళ్లింది.

అక్కడ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రగ్యా తోమర్‌ను సంప్రదించింది. ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి ఆ లేడీ డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న వయసులో, కనీసం విరామం లేకుండా వరుసగా గర్భం దాల్చడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలను డాక్టర్ వివరించారు. ఒక కొడుకు ఉన్నా, ఇంట్లో సంపాదనకు ఎక్కువ మంది మగపిల్లలు ఉండాలనే ఉద్దేశంతోనే మళ్లీ గర్భం దాల్చమని భర్త ఒత్తిడి చేసినట్లు ఆ యువతి వాపోయింది.

ఈ ఘటనతో చలించిపోయిన డాక్టర్ ప్రగ్యా, యువతి అనుమతితో ఈ సంభాషణను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియో కోట్లాది వ్యూస్‌తో వైరల్‌గా మారింది. యువతి ఆరోగ్యం పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, కొడుకుల కోసం ఆశపడే ఈ తరహా సామాజిక ధోరణిని తీవ్రంగా విమర్శిస్తున్నారు.