తమిళనాడు రాజకీయాల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా, ముఖ్యమంత్రి విజయ్ తన వీరాభిమానికి కేబినెట్‌లో కీలక పదవి కట్టబెట్టారు. తన 'ది గోట్' సినిమాలో ట్రాఫిక్ పోలీస్ పాత్రలో కనిపించిన తమిళన్ పార్తిబన్‌ను నిజ జీవితంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా నియమించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే... తమిళన్ పార్తిబన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో సేలం సౌత్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన ఆయన, నటుడు విజయ్‌కు దశాబ్దాలుగా వీరాభిమానిగా, సన్నిహితుడిగా ఉన్నారు. ఈ పరిచయంతోనే విజయ్ తన 'ది గోట్' సినిమాలో పార్తిబన్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా నటించే అవకాశం ఇచ్చారు. సినిమాలో ట్రాఫిక్‌ను నియంత్రించిన ఆయన, ఇప్పుడు నిజంగానే రాష్ట్ర రవాణా వ్యవస్థను నడిపించబోతుండటం విశేషం.

ఒకప్పుడు తన అభిమాన హీరో సినిమాలో చిన్న వేషం వేసిన వ్యక్తి, అదే హీరో ముఖ్యమంత్రి అయ్యాక ఆయన కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అరుదైన ఘటన. తనపై నమ్మకముంచి మొదట సినిమాలో, ఇప్పుడు ప్రభుత్వంలో కీలక అవకాశం ఇచ్చిన విజయ్ రుణం తీర్చుకుంటానని పార్తిబన్ తెలిపారు. ఈ అనూహ్య నియామకంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, సామాన్యుడికి అరుదైన గౌరవం దక్కిందని మరికొందరు ప్రశంసిస్తున్నారు.