మోదీ సుదీర్ఘ మీటింగ్.. మంత్రులకు ఇచ్చిన ఆ సూచనలు ఏంటి?

Narendra Modi Reviews with Ministers on Viksit Bharat and Key Issues
  • నాలుగున్నర గంటలు జరిగిన భేటీ
  • తొమ్మిది మంత్రిత్వ శాఖల నివేదికల సమర్పణ
  • ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’, ‘ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌’పై చర్చించినట్లు ప్రధాని మోదీ వెల్లడి
  • ఐదు దేశాల పర్యటన వివరాలను పంచుకున్న జైశంకర్‌
  • పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రజలకు ఇబ్బందులు రావొద్దని ప్రధాని దిశానిర్దేశం
‘వికసిత్ భారత్ 2047’ కేవలం ఒక నినాదం కాదని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ఒక బాధ్యతగా, బలమైన నిశ్చయంగా భావించాలని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం కేంద్ర మంత్రిమండలితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈ భేటీ సాగింది.  మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి ఇది ఒక మధ్యంతర సమీక్షగా నిలిచింది.

పశ్చిమాసియా సంక్షోభం, ప్రధాని ఐదు దేశాల పర్యటన, ఇంధన పొదుపుపై పటిష్ఠ చర్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఏదో కీలక నిర్ణయం తీసుకోనుందని జోరుగా ప్రచారం జరిగింది. 

పాలనా సంస్కరణలు
ఈ సమావేశంలో పాలనా సంస్కరణలు, ప్రభుత్వ పనితీరుపై ప్రధానంగా చర్చించారు. తొమ్మిదికి పైగా మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ప్రధానికి సమర్పించాయి. అలాగే నీతి ఆయోగ్, క్యాబినెట్ సెక్రటరీ కూడా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఫైళ్లను అత్యంత వేగంగా పరిష్కరించిన శాఖలను ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా అమలయ్యేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.

విదేశీ పర్యటన వివరాలు
ప్రధాని మోదీ ఇటీవలి ఐదు దేశాల పర్యటన విజయవంతం కావడంపై మంత్రులు ఆయనను సత్కరించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల విజయాన్ని కూడా ప్రస్తావించారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈ పర్యటన విశేషాలను వివరించారు. మరోవైపు పశ్చిమాసియా సంక్షోభం, దాని వల్ల వచ్చే ఆర్థిక సవాళ్లపై మోదీ చర్చించారు. ఈ సంక్షోభం వల్ల దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొరియాలో, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా జెనీవాలో ఉన్నందున ఈ భేటీకి రాలేకపోయారు.

‘‘నిన్న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం చాలా ఫలప్రదంగా సాగింది. దేశంలో ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ (జీవన సౌలభ్యం), ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ (వ్యాపార సౌలభ్‌యం) మరింత మెరుగుపరచడంపై పరస్పర ఆలోచనలు, ఉత్తమ విధానాలను పంచుకున్నాం. వికసిత్ భారత్ అనే మన ఉమ్మడి కలను సాకారం చేసుకోవడానికి పాలనా సంస్కరణలను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై కూడా చర్చించాం’’ - ప్రధాని మోదీ
Go Back to Shorts
Narendra Modi
Viksit Bharat 2047
Indian Economy
Cabinet Meeting
Governance Reforms
Ease of Living
Ease of Doing Business
West Asia Crisis
S Jaishankar

More Telugu News