మీ పిల్లలు తరచూ అలసిపోతున్నారా? ఆడుకోవడానికి కూడా ఓపిక లేకుండా నీరసంగా కనిపిస్తున్నారా? ముఖం పాలిపోయినట్టుగా ఉందా? ఇవన్నీ పిల్లలలో రక్తహీనత (అనీమియా) సమస్యకు సంకేతాలు కావచ్చు. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే, దీనిని నివారించడానికి ఖరీదైన మందులు వాడాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో దొరికే సాధారణ ఆహార పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పిల్లల రోజువారీ ఆహారంలో కొన్ని పదార్థాలను చేర్చడం ద్వారా వారిలో రక్తహీనతను నివారించి, ఆరోగ్యంగా ఉంచవచ్చు.

తప్పకుండా చేర్చాల్సిన ఆహారాలు:

రాగి జావ, ఎండుద్రాక్ష (కిస్మిస్), హలీమ్ గింజలు: ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. 
ఆకుకూరలు: పాలకూర వంటివి కొత్త రక్త కణాల తయారీకి చాలా అవసరం. 
నువ్వులు: రక్త ఆరోగ్యానికి మేలు చేసి, ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. 
పప్పులు: ఐరన్, ప్రోటీన్లు పుష్కలంగా అందించి శక్తినిస్తాయి. 
గుడ్లు: రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో దోహదపడతాయి. 
అటుకులు: ఐరన్‌తో పాటు తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్‌లు అందిస్తాయి.

విటమిన్ 'సి' పాత్ర కీలకం 
ఐరన్ ఉన్న ఆహారాలు తిన్నప్పటికీ, శరీరం దానిని సరిగ్గా గ్రహించుకోవాలంటే విటమిన్ 'సి' తప్పనిసరి. నారింజ, నిమ్మ, జామ, ఉసిరి, బొప్పాయి, క్యాప్సికం వంటి వాటిని పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఇవి ఐరన్ శోషణను పెంచుతాయి. సరైన పోషకాహారం అందించి, పిల్లల భవిష్యత్తును ఆరోగ్యంగా తీర్చిదిద్దడం తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది.