బండి భగీరథ్ పోక్సో కేసు.. మరో సెక్షన్ ను జత చేసిన పోలీసులు

Bandi Bhagirath POCSO Case Police Add Another Section
  • కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసిన భగీరథ్
  • ఫోన్ లోని డేటాను డిలీట్ చేసిన వైనం
  • సాక్ష్యాలను ధ్వంసం చేసిన సెక్షన్ జత చేసిన పోలీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కీలక సాక్ష్యాలను మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన వెంటనే ఫోన్ స్విచ్చాఫ్ చేసిన నిందితుడు, పరారీలో ఉన్న సమయంలో పథకం ప్రకారం తన అత్యాధునిక ఐఫోన్‌లోని డేటాను, కీలక వీడియోలను డిలీట్ చేయడమే కాకుండా, సోషల్ మీడియా అకౌంట్లను కూడా మాయం చేశాడు. 


అరెస్ట్ అనంతరం పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకోగా, అందులో సిమ్ కార్డ్ లేకపోవడం, ఫోన్ ఖాళీగా ఉండటంతో.. సాక్ష్యాలను ధ్వంసం చేసిన నేరం కింద పోలీసులు ఈ కేసులో అదనంగా బీఎన్ఎస్ సెక్షన్ 238ను (గతంలో ఐపీసీ 201) జోడించారు. చట్టం నుంచి తప్పించుకోవడానికి ఫోన్‌ను పలుమార్లు ఫార్మాట్ చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు, నిందితుడి కంటే వంద రెట్లు పవర్‌ఫుల్ టెక్నాలజీతో ఉచ్చు బిగించేందుకు సిద్ధమయ్యారు.


ఐఫోన్ సెక్యూరిటీ ఫీచర్లు కఠినంగా ఉన్నప్పటికీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) నిపుణుల వద్ద ఉన్న 'సెలెబ్రైట్' వంటి అంతర్జాతీయ స్థాయి అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ల ద్వారా డిలీట్ అయిన చాటింగ్, వీడియోలు, ఫొటోలను రికవరీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఐఫోన్ అంతర్గత మెమొరీని పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసినా, ఐక్లౌడ్ బ్యాకప్ సర్వర్ల నుండి డేటాను సేకరించేందుకు, అవసరమైతే కోర్టు ద్వారా యాపిల్ సంస్థను సంప్రదించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. వీటితో పాటు, నిందితుడు ఫోన్ స్విచ్చాఫ్ కావడానికి ముందు ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడాడు, ఆశ్రయం కల్పించిన తెరవెనుక సూత్రధారులు ఎవరు అనే వివరాల కోసం సెల్ టవర్ మ్యాపింగ్, కాల్ డేటా రికార్డులను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.


ఈ సాంకేతిక ప్రక్రియల్లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, కేసును పటిష్టంగా కోర్టు ముందు నిలబెట్టేందుకు పోలీసులు 'ప్లాన్ బి'ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా బాధితురాలి ఫోన్‌ను మరో కీలక సాక్ష్యంగా మార్చనున్నారు. నిందితుడు బాధితురాలికి పంపిన బెదిరింపు సందేశాలు, ఫొటోలు, వీడియోలను 'రిసీవ్డ్ డేటా' రూపంలో సేకరించి, వాటిని ధ్రువీకరించి కోర్టు ముందు ఉంచనున్నారు. పోక్సో కేసులో సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నించడం నేర తీవ్రతను మరింత పెంచుతుందని చట్టపరమైన నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Go Back to Shorts
Bandi Bhagirath
POCSO case
Telangana
cyber forensics
data recovery
phone data deletion
cyber crime
FSL
Apple iCloud
evidence tampering

More Telugu News